నానాటికి తీసికట్టు మన చట్ట సభల పరిస్థితి

 

ఒకప్పుడు రాష్ట్ర విభజన సమయంలో గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తుంటే, తెరాస సభ్యులు ఆయన చేతిలో నుండి ప్రసంగ ప్రతులను లాక్కొని చింపివేసి సభలో నానా రభస చేసిన సంగతి అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఇప్పుడు అదే గవర్నరు తెరాస ప్రభుత్వ విధానాలను, ఆశయాలను వివరిస్తూ ఉపన్యసించవలసివస్తోంది. ఆనాడు ఆయన చేతిలో నుండి ఉపన్యాస కాగితాలు లాక్కొన్ని ఆయన ప్రసంగానికి అడ్డు తగిలినప్పుడు, తెరాస యం.యల్యే.లకు ఏమీ తప్పు అనిపించలేదు. కానీ ఈ రోజు తెదేపా, కాంగ్రెస్ యం.యల్యే.లు పోడియంలో నిలబడి పార్టీ ఫిరాయింపు చేసినవారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ నినాదాలు చేస్తుంటే, తెరాస యం.యల్యే.లకు వారిపై పట్టరాని ఆగ్రహం కలిగింది. వారూ తమ స్థానాలలో నుండి లేచి అందుకు అభ్యంతరం చెప్పి ఉండి ఉంటే బాగుండేది. కానీ వారు కూడా పోడియంలోకి దూసుకు వచ్చేసి గవర్నరు నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు స్పీకర్ మధుసూధనాచారి సమక్షంలోనే ప్రతిపక్ష యం.యల్యే.లతో వాగ్వాదాలకు, తోపులాటలకు దిగడం చాలా విస్మయం కలిగిస్తోంది. ఆ తోపులాటలో ప్రతిపక్ష సభ్యులు కొందరు క్రిందపడిపోయారు.

 

ప్రతిపక్ష సభ్యులు సభా సాంప్రదాయాలు తుంగలో తొక్కుతూ గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలడం ఒక తప్పయితే, బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికార పార్టీ సభ్యులు గవర్నర్ సమక్షంలోనే వారిపై భౌతిక దాడులు చేయడం మరో తప్పు. అటువంటి పరిస్థితుల్లో సభాపతి స్పీకర్, ముఖ్యమంత్రి మౌనంగా చూస్తూ కూర్చోవడం అంతకంటే పెద్ద తప్పు. అధికార, ప్రతిపక్షాలు ఒకరిని మరొకరు రాజకీయంగా దెబ్బతీయలనుకొంటే అటువంటి కార్యక్రమాలు సభ బయట నిర్వహించుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండబోదు. కానీ ప్రజాసమస్యలను చర్చించి, పరిష్కరించేందుకు ప్రజాధనం వెచ్చించి నిర్వహిస్తున్న చట్ట సభలలో ఈవిధంగా వ్యవహరించడం చాలా దారుణం. అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ కలిసి గవర్నర్ పట్ల ఈవిధంగా అమర్యాదగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యానికి మూలస్థంభమయిన చట్టసభలను చివరికి ఈ స్థాయికి దిగజార్చడం చూస్తుంటే చాలా ఆందోళన కలుగుతోంది.

 

ప్రజలకు మార్గదర్శనం చేయవలసిన ప్రజా ప్రతినిధులే ఈ విధంగా వ్యవస్థలను, చట్టసభలను అపహాస్యం చేయడం, మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకోవడం చూస్తుంటే అటువంటి వారిని ఎన్నుకొన్నందుకు ప్రజలు కూడా సిగ్గుతో తలదించుకొనే పరిస్థితి కలుగుతోంది. ఒకవేళ ప్రభుత్వాలు గాడి తప్పుతుంటే వాటిని మళ్ళీ గవర్నరే గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది కనుక ఆయన ఇటువంటి సంఘటనలను ఎంతమాత్రం ఉపేక్షించకుండా బాధ్యులపై కటినమయిన చర్యలు తీసుకొన్నట్లయితే మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చును. అలా కాదని ఆయన కూడా ప్రేక్షకపాత్ర వహిస్తే చట్టసభల స్థాయి ఇంకా దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది.