ఏపీ సీఐడీ పీవీ సునీల్ కుమార్ పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జి.. ఇక అరెస్టేనా?
posted on Apr 25, 2025 10:28AM

ఏపీసీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ అరెస్టునకు రంగం సిద్ధమైందా? ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ అంజనేయులు అరెస్టైన రోజుల వ్యవధిలోనే మరో సీనియర్ పోలీసు అధికారి అరెస్టు కానున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న ఎవరైనా సరే ఔననే సమాధానమిస్తారు. ముంబై నటి కాదంబరి జత్మలానీపై అక్రమంగా కేసు నమోదు చేసి ముంబై నుంచి విజయవాడ తీసుకువచ్చి అక్రమంగా నిర్బంధించిన కేసులో పీఎస్సార్ ఆంజనేయులు అరెస్టయ్యారు. ఇప్పుడు జగన్ హయాంలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ గా తన పరిమితులను మీరి, ఇష్టారీతిగా వ్యవహరించిన పీవీ సునీల్ కుమార్ అరెస్టునకు రంగం సిద్ధమైంది. పీవీ సునీల్ కుమార్ పై తాజాగా సర్వీసు నిబంధనల ఉల్లంఘనను ప్రస్తావిస్తూ తెలుగుదేశం కూటమి సర్కార్ గురువారం ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ ను గురువారం (ఏప్రిల్ 24) జారీ చేసింది.
జగన్ హయాంలో సీఐడీ చీఫ్ గానూ, అగ్నిమాపక డీజీగానూ పని చేసిన పీవీ సునీల్ కుమార్ అప్పట్లో నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఆయనపై ప్రభుత్వం ఆర్టికల్స్ ఆఫ్ చార్జి జారీ చేసింది. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా పీవీ సునీల్‌కుమార్ పలుమార్లు విదేశాలకు వెళ్లారని విచాణలో తేలిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో 2022లో జార్జియా పర్యటనకు అనుమతులు తీసుకున్న పీవీ సునీల్‌కుమార్ యూఏఈకి వెళ్లారనే దానిపై ఒకటి, మరో సారి ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా స్వీడన్ దేశానికి వెళ్లారన్నదానిపై మీద రెండోది, పోస్టింగ్ లేకుండా వెయిటింగ్‌లో ఉన్న సమయంలో కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే అమెరికా దేశానికి వెళ్లారన్న దానిపై మరోటి చొప్పున ప్రభుత్వం ఆర్టికల్ ఆఫ్ చార్జ్ జారీ చేసింది. అంతకు ముందు కూడా అంటే 2019లో అమెరికా వెళ్తున్నట్లు ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది యూకే వెళ్లారనే దానిపైనా చార్జ్ చేసింది.
మొత్తం ఆరు సార్లు ప్రభుత్వానికి తెలియకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలపై ఆయనను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పీవీ సునీల్‌కుమార్ మీద మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా అభియోగాలు ఉన్నాయి. ఆరు సార్లు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపైన విచారణ చేపట్టేందుకు సీనియర్ ఐఏఎస్, స్పెషల్ సీఎస్ స్థాయిలో ఉన్న ఆర్‌పీ సిసోడియాను విచారణ అధికారిగా నియమించింది. ఐపీఎస్ అధికారులు విదేశాల పర్యటనలకు వెళ్లే ముందు చైన్ ఆఫ్ కమాండ్ ప్రోటోకాల్‌లను పాటించాలని, కానీ పీవీ సునీల్ కుమార్ పదే పదే నిబంధనలను ఉల్లంఘించారని, ఇది క్రమ శిక్షణా రాహిత్యంగా పరిగణించడంతో పాటుగా ఆలిండియా సర్వీసెస్ రూల్స్ కింద సస్పెండ్ చేస్తున్నట్లు ఇది వరకు తెలిపిన ప్రభుత్వం తాజాగా ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్‌ను నమోదు చేసింది.