రాజకీయలలో చేరుతామేమో: అశోక్ బాబు

 

దాదాపు ఐదు లక్షల మంది సీమాంధ్ర ప్రభుత్వోద్యోగులను రెండు నెలల పాటు సమైక్యంగా నిలిపి సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసిన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు, నిన్న కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో తమను పల్లెల్లో, పట్టణాలలో అనేకమంది ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు రాజకీయాలలో రావాలని కోరుతున్నారని, అయితే తాము ప్రభుత్వోద్యోగులుగానే ఉండి వారికి సేవలందిస్తూ, సమైక్యాంధ్ర కోసం పోరాటం చేయాలనుకొంటున్నామని చెప్పారు. కానీ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ గందరగోళం, రాష్ట్ర విభజన విషయంలో మొండిగా సాగుతున్న డిల్లీని సరిచేయాలంటే తాము కూడా రాజకీయాలలోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాము రాజకీయాలలోకి రాక తప్పదని హెచ్చరించారు. అందువల్ల ఇప్పటికయినా సీమాంద్రాలో రాజకీయ పార్టీలన్నీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చిత్తశుద్దితో కృషి చేయాలని కోరారు."

 

 

ఇంతవరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు,కాంట్రాక్టర్లు, నటులు, ఇతరులు రాజకీయాలలోకి రావడం ప్రజలు చూసారు. కానీ తెలంగాణా ఉద్యమాలు మొదలయ్యాక ప్రభుత్వోద్యోగుల రాజకీయ ప్రవేశం మొదలయింది. ప్రభుత్వోద్యోగులు సర్వీసులో ఉండగా ప్రత్యక్షంగా రాజకీయాలలో పాల్గొనడానికి, వాటిలో చేరడానికి అనుమతించని నియమ నిబందనల గురించి ప్రశ్నించే దైర్యం ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి లేదు. ఎందుకంటే వారి అండదండలతోనే ఇప్పుడు ఉద్యమాలు నడుస్తున్నాయి. అందుకే ఉద్యమాల పేరుతో రాజకీయంగా ఎదగాలనే తపన ప్రభుత్వోద్యోగులలో నానాటికి పెరిగిపోతోంది.

 

ముప్పై ఏళ్ళు కష్టపడి సర్వీస్ చేసిన రాని పేరు ప్రతిష్టలు, గుర్తింపు, ఆదాయం అన్నీ కేవలం కొన్ని నెలల ఉద్యమాలతో వస్తుంటే ఎవరికయినా వదులుకోవడం కష్టమే. బహుశః అందుకు అశోక్ బాబు కూడా మినహాయింపు కారని అర్ధం అవుతోంది. ఇది వారి ఉద్యమ నిబద్దతను ప్రశ్నార్ధకం మార్చుతుంది.

 

రాజకీయ నాయకులు తమ ధనబలం, అంగ బలం, పార్టీల అండ దండలతో రాజకీయంగా మరింత పైకెదగాలనుకొంటుంటే, ప్రొఫెసర్ కోదండరామ్, స్వామీ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అశోక్ బాబు తదితరులు ఉద్యమాల ద్వారా రాజకీయలలోకి ప్రవేశించి పైకి ఎదగాలనుకొంటున్నారు. అటువంటప్పుడు ఆయన (అశోక్ బాబు) విమర్శిస్తున్న రాజకీయ నేతలకి తనకీ ఉన్న వ్యత్యాసం ఏమిటో ఆయనే చెప్పాలి.