అరేయ్‌ సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా.. వైసీపీ తుప్పురేగ్గొట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌..

అస‌లే లెక్క‌లేనంత తిక్క‌. ఆపై కాక మీదున్నారు. ఓ వైపు అల్లుడు కోమాలో ఉన్నాడ‌నే ఆవేద‌న‌. మ‌రోవైపు ఏపీలో సినిమా ఇండ‌స్ట్రీని తొక్కేస్తున్నార‌నే ఆవేశం. అవి, ఇవి అన్నీ క‌ల‌గ‌లిసి.. వైసీపీపై చెల‌రేగిపోయారు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. రిప‌బ్లిక్ ఆడియో ఫంక్ష‌న్‌లో ఆయ‌న ప‌వ‌ర్‌స్టార్‌లా కాకుండా, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లా పొలిటిక‌ల్ స్పీచ్ ఇచ్చారు. అది స్పీచ్ అన‌డం కంటే.. వైసీపీ ప్ర‌భుత్వాన్ని, జ‌గ‌న్‌రెడ్డిని, పేర్నినానిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశారు అంటే క‌రెక్ట్‌గా ఉంటుంది. గ‌తంలో జ‌నసేన స‌భ‌ల్లో ఆవేశంగా మాట్లాడే ప‌వ‌న్‌.. ఏనాడు పెద్ద‌గా తిట్ల జోలికి వెళ్ల‌లేదు. కానీ, స‌హ‌నం న‌శించిందో లేక‌, వైసీపీకి ఆ బాష‌లోనే చెబితే అర్థం అవుతుంద‌ని అనుకున్నారో ఏమో కానీ, అరేయ్ సన్నాసుల్లారా, ఆరేయ్ దద్ద‌మ్మ‌ల్లారా.. అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. దాదాపు గంట పాటు నాన్‌స్టాప్‌గా వైసీపీని కుమ్మిప‌డేశారు. 

ఏపీలో ఆన్‌లైన్ టికెటింగ్ వ్య‌వ‌హారాన్ని తీవ్ర స్థాయిలో త‌ప్పుబ‌ట్టారు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. త‌నపై కోపంతో సినిమాను చంపేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇండ‌స్ట్రీ జోలికొస్తే కాలిపోతారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆన్‌లైన్‌ టికెట్ల ఆదాయం చూపి అప్పులు తెచ్చుకోడానికే అలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రైవేటు వ్యక్తులు తీసే సినిమాపై ప్రభుత్వ ఆధిపత్యం ఏమిటని ప్రశ్నించారు. ‘సన్నాసి మంత్రి’ అంటూ పేర్ని నానిపై విరుచుకుప‌డ్డారు. ‘‘చిరంజీవి అంటే సోదర భావన అని ఆ సన్నాసి అంటారు. సోదిలో సోదర భావన.. చిత్ర పరిశ్రమకు ఉపయోగపడని సోదర భావన ఎందుకు? అని నిల‌దీశారు. ప‌నిలో ప‌నిగా న‌టుడు మోహన్‌బాబుకు కూడా కౌంట‌ర్ వేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇప్పుడు సినిమాలు.. రేపు మీ స్కూళ్లు.. అంటూ హెచ్చ‌రించారు. 

ఇక సాయిధ‌ర‌మ్‌తేజ్ యాక్సిడెంట్‌పై మీడియా వండి వార్చిన క‌థ‌నాల‌నూ త‌ప్పుబ‌ట్టారు. ఆ విష‌యం ప్ర‌స్తావిస్తూ.. వైసీపీని ఏకిపారేశారు. సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదంపై చర్చించడం మానేసి.. నేర రాజకీయాలపై మాట్లాడాలని సూచించారు. ‘‘వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడండి.. విశాఖలో, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విమానాశ్రయంలో ఒక నాయకుడిపై కోడి కత్తితో దాడి జరిగింది.. దీని వెనుక భారీ కుట్ర ఉందని అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ కూడా అన్నారు. ఆ కేసు ఏమైందో అడగండి. లక్షలాది ఎకరాల  పోడు భూములు గిరిజనులకు ఎందుకు దక్కడం లేదో... దారి గురించి మాట్లాడండి’’ అని సూచించారు. 

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్‌ గురించి మాట్లాడిన వాళ్లు.. వైసీపీ రాగానే ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలని అధికార పార్టీని నిల‌దీశారు. ‘‘రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు? బోయలకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం లభించడంలేదు? అని పవన్‌ ప్రశ్నించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో ఆస‌క్తిక‌ర అంశాన్నీ ప్ర‌స్తావించారు. ఇడుపులపాయలో నేలమాళిగల్లో టన్నుల కొద్దీ డబ్బులుంటాయని అంటారని.. దానిమీద కూడా మీడియా స్టోరీలు చేస్తే బాగుంటుంద‌న్నారు జ‌న‌సేనాని. ప్రెసిడెంట్‌ మెడల్‌ కావాలంటే సాహసం చేయాలి.. కానీ, ఏపీలో బ్రాందీ కొట్టుకు వెళితే ప్రెసిడెంట్‌ మెడల్‌ క్వార్టర్‌ బాటిల్‌ దొరుకుతుందంటూ ఏపీ లిక్క‌ర్ పాల‌సీపై మండిప‌డ్డారు.

ఇలా, రిప‌బ్లిక్ వేదిక‌గా ప‌వ‌న్‌కల్యాణ్ ప్ర‌సంగం ఆసాంతం రెబెల్‌గా సాగింది. మాట మాట‌లో ఆయ‌న‌లో అస‌హ‌నం, ఆగ్ర‌హం సుస్ప‌ష్టంగా కనిపించింది. స‌న్నాసుల్లారా.. అనే ప‌దం ప‌దుల సార్లు వాడారు. జ‌గ‌న్‌రెడ్డినో, పేర్ని నానినో ఎదురుగా ఉంటే కొట్టే వాడేమో అనిపించేలా ఆవేశంతో ఊగిపోయారు. త‌న సినిమాల‌ను టార్గెట్ చేయ‌డం, ఆన్‌లైన్ టికెటింగ్‌పై ప‌వ‌ర్‌స్టార్ బాగా ర‌గిలిపోతున్నార‌నే విష‌యం ఆయ‌న మాట‌ల‌తో స్ప‌ష్టమైంది. వైసీపీ డ‌బుల్‌గేమ్‌, కాపు రిజ‌ర్వేష‌న్లు, వైఎస్ వివేక మ‌ర్డ‌ర్ కేసు, కోడి క‌త్తి కేసు, బ‌లిజ‌లు, బోయ‌ల క‌ష్టాలు, లిక్క‌ర్ పాల‌సీ.. ఇలా త‌న ప్ర‌సంగంలో అడుగ‌డుగునా ఏపీ ఇష్యూస్‌ను ప్ర‌స్తావించి.. ప్ర‌శ్నించి.. ప‌వ‌ర్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌లా బ్లాస్ట్ అయ్యారు జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.