ఏపీకి ప్రత్యేక హోదా లేదట
posted on Apr 24, 2015 6:14PM

ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో ప్రతిపక్షంలో వున్న బీజేపీ ఇచ్చిన ఐదు సంవత్సరాల ప్రత్యేక హోదా ఇక రానట్టేనని తెలిసిపోయింది. ప్రత్యేక హోదా ఐదేళ్ళు ఇస్తానని కాంగ్రెస్ అంటే, కాదు కాదు పదేళ్ళు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన బీజేపీ కూడా ఇప్పుడు మాట మార్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని శుక్రవారం నాడు పార్లమెంటులో తేల్చి చెప్పింది. ఏపీకి ఇప్పటికే చాలా ఇచ్చామని, ఇక ఇచ్చే అవకాశం లేదని తెలిపింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఎంపీలు కొత్త ప్రభాకరరెడ్డి, మాగంటి బాబు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్ లోక్‌సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ అంశాన్ని స్పష్టం చేశారు. ఇకపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదాపై ఇచ్చే అవకాశం లేదని, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులే ఆర్థిక అవసరాలకు మార్గదర్శకం అని మంత్రి తన సమాధానంలో తేల్చేశారు.
ఏపీ విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చామని, పలు పారిశ్రామిక రాయితీలు ప్రకటించామని, అదనపు పెట్టుబడి, అదనపు తరుగుదల రాయితీలు ఇచ్చామన్నారు. ఇవి ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్ల పాటు అమలవుతాయని మంత్రి తెలిపారు.