ఆ జీఓ.. దొడ్డి దారిన రాజధానిని తరలించడానికేనా?

గురువారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ అర్ధం దొడ్డి దారిన రాజధానిని తరలించడానికేనా అంటే, అవుననే సమాధానం వొస్తోందీ రాజకీయ మరియు అధికార వర్గాలనుండి. 

 

రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాల శాఖ ద్వారా నిన్న జీవో నెంబర్ 1353 ని విడుదల చేసింది. దీనీలో, విశాఖపట్నం దగ్గరలోని భీమునిపట్నం మండలంలో వున్న గ్రేహౌండ్స్ కు సంబంధించిన సర్వే నెంబర్ 386/2 లోని 300 ఎకరాలలో 30 ఎకరాలు విశాఖపట్నం జిల్లా కల్లెక్టర్ పేరుపై స్టేట్ గెస్ట్ హౌస్ కట్టడానికి ట్రాన్స్ఫర్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 

దీంతో, ముఖ్యమంత్రి జగన్ రాజధాని తరలింపుపై చర్యలు మొదలు పెట్టారని, దొడ్డిదారిన తరలింపు మొదలైనట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమయింది. రాజధానిపై న్యాయ వివాదం ఇప్పట్లో పరిష్కారం అయ్యే సూచనలు కనబడక పోవడంతో జగన్ ఇలా దొడ్డి దారిని ఎంచుకున్నారని, దీనిపై కూడా త్వరలో కోర్టుకు వెళ్తామని కొందరు రాజకీయ నాయకులంటున్నారు. 

 

రాజధాని వివాదంపై రాష్ట్ర హై కోర్ట్ లో సెప్టెంబర్ 21 నుండి రోజువారీ విచారణ జరిగే అవకాశం ఉన్నప్పటికీ, వివాదం అంతటితో ఆగే అవకాశాలు లేవు. హైకోర్టులో ఒకవేళ తమకు ప్రతికూలంగా జడ్జిమెంట్ వస్తే వారు సుప్రీమ్ కోర్ట్ కు కూడా వెళ్ళే అవకాశాలే వున్నాయి కాబట్టి, ముందు అవసరమైన బిల్డింగ్లు కట్టిస్తే వెంటనే అక్కడకు తరలి పొవచ్చనే ఉద్దేశంతోనే, జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకుల భావన. 

 

ప్రస్తుతం గెస్ట్ హౌస్ గా చెబుతున్నా, హై కోర్టుల్లో ప్రభుత్వ అనుకూల తీర్పు వచ్చిన మరుక్షణం, పిటీషర్లు సుప్రీమ్ కోర్టుకు వెళ్లబోయే ముందే ఈ గెస్ట్ హౌస్ ను సిఎం క్యాంప్ కార్యాలయంగా మార్చుకుంటే సరిపోతుందనేది ప్రభుత్వ ఆలోచనగా పరిశీలకులు భావిస్తున్నారు. 

 

అయితే,  గెస్ట్ హౌస్ నిర్మాణంపై ఇప్పటికే ఒకరు హైకోర్టుకు వెళ్లారని, ఆ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు సెప్టెంబర్ 10 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చిందని కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికి, జగన్ ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా రాజధాని తరలింపులో మాత్రం వెనకడుగు వెయ్యరనేది స్పస్టమవుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏంముజరుగుతుందో. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu