సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్.. మున్సిపల్ శాఖకు శ్రీలక్ష్మి
posted on Dec 22, 2020 4:38PM
ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియామకం అయ్యారు. ఈనెల 31వ తేదీన ప్రస్తత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ముగియనుంది. దాంతో అదే రోజున ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన శ్రీలక్ష్మికి ఏపీ సర్కార్ మున్సిపల్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె. సునీత నియామకం అయ్యారు. ఇక సీఎస్‌గా పదవీ విరమణ పొందనున్న నీలం సాహ్నీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆదిత్యనాథ్ దాస్. నిజానికి నీలం సాహ్ని తర్వాత సీనియారిటీలో ఆమె భర్త అజయ్ సాహ్ని, ఆ తర్వాతి స్థానాలలో సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఎస్వీ ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. వీరిలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉండగా, అభయ్ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పనిచేస్తున్నారు. మరో ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర మాజీ సీఎం చంద్రబాబు పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసారు. ఆయనను సీఎస్ గా చేయడానికి జగన్ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. సీసీఎల్ఏ బాధ్యతలు చూస్తున్న నీరబ్ ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే నీరబ్‌కు 2024 జూన్ వరకూ పదవీకాలం ఉంది. అంత ఎక్కువ కాలం ఒకరినే సీఎస్ గా కొనసాగించడం సరికాదన్న ఉద్దేశంతో సీఎం జగన్ ఆదిత్యనాథ్ వైపే మొగ్గుచూపారని చెబుతున్నారు. అంతేకాదు జగన్ కు మొదటి నుంచి ఆధిత్యనాథ్ నమ్మకస్తుడిగా ఉన్నారు. అందుకే జగన్ కూడా ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
ఉమ్మడి ఏపీలో సంచలనం రేపిన మైనింగ్ స్కాంలో అరెస్టై జైలుకు వెళ్లిన సీనియర్ ఐఎస్ అధికారి వై.శ్రీలక్ష్మిని పట్టుబట్టి మరీ ఏపీకి తీసుకువచ్చిన జగన్... ఆమెకు కీలకమైన మున్సిపల్ శాఖ అప్పగించారు. అత్యంత కీలకమైన అమరావతి, మూడు రాజధానులపై వివాదం జరుగుతున్న సమయంలో.. ఆ వ్యవహారాలు చూసే మున్సిపల్ శాఖ సెక్రటరిగా శ్రీలక్ష్మి నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి ఓ వెలుగు వెలిగారు. గనులశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఓబుళాపురం మైనింగ్ కు అనుమతుల విషయంలో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించడం ద్వారా గాలి జనార్ధనరెడ్డికి భారీగా లబ్ధి చేకూరింది. దీంతో శ్రీలక్ష్మి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణల వచ్చాయి. వైఎస్ మరణం తర్వాత సీబీఐ మైనింగ్ తో పాటు జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదు చేయడంతో ఆమె జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది. జైలులో ఆమె ఆరోగ్యం క్షిణించడం ఆ తర్వాత కోలుకోవడం జరిగాయి.
తెలంగాణ కేడర్ లో ఉన్న శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకురావడం కోసం సీఎం జగన్ కేంద్రం దగ్గర లాబీయింగ్ చేశారు. .అయితే కేంద్రం ఆమెను డిప్యుటేషన్‌పై ఏపీకి పెంపేందుకు నిరాకరించింది. సెక్రటరీ స్ధాయి అధికారుల డిప్యుటేషన్ కుదరదని చెప్పేసింది. సీఎం జగన్ జోక్యం చేసుకుని ఆమెకు మద్దతుగా కేంద్రాన్ని కోరినా ఫలితం లేకపోయింది. దీంతో ఏడాదిన్నర కాలంగా ఆమె తెలంగాణ క్యాడర్‌లోనే పనిచేయాల్సి వచ్చింది. చివరకు క్యాట్ ను ఆశ్రయించి అనుకున్నది సాధించారు శ్రీలక్ష్మి. క్యాట్ అదేశాలతో ఆమె ఏపీకి బదిలీ అయ్యారు. వైఎస్ హయాంలో కీలకంగా ఉన్న అధికారులకే జగన్ కీలక పోస్టులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. సీనియర్లను కాదని కొందరు జూనియర్లకు కీలక పోస్టులు కట్టబెట్టారనే విమర్శలు వచ్చాయి.