ఏపీలో కంచే చేను మేసింది.. జీపీఎఫ్‌ సొమ్ములు మాయం చేసింది!

కంచే చేను మేస్తే ... ఏమి జరుగుతంది? పండిన పంట మాయమై పోతుంది. ఇప్పడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా అదే. ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎఫ్‌ ఖాతాలోని సోమ్ములకు రెక్కలొచ్చాయి. ఎలా మాయమై పోయాయో తెలియ కుండానే, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు 90 వేల మంది ఉద్యోగులకు చెందిన రూ.800 కోట్ల జీపీఎఫ్‌ నిధులు మాయమైపోయాయి.  

ఎలా అని అలా విస్తుపోకండి . ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వంలో ఇదీ అదని కాదు, ఏదైనా సాధ్యమే.. అందులోనూ ఆర్థిక అవకతవకలు, అక్రమాలు, మరీ ముఖ్యంగా కంటికి కనిపించని కత్తిరింపుల విషయం అయితే అసలు చెప్పనే అక్కర లేదని, అదే ప్రభుత్వ ఉద్యోగులే అంటున్నారు. నిజానికి ఇలా, ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖతాల్లోంచి, డబ్బులు మాయం కావడంఇదే మొదటి  సారి కాదు. గతంలోనూ, ఇలాగే, ఉద్యోగులకు తెలియాకుండానే, వారి ఖాతాల్లోంచి డబ్బులు మాయమై పోయాయి. చివరకు, ఆ విషయం బయట పడడంతో గుట్టు చప్పుడు కాకుండా, ఆర్థిక శాఖ, సర్దేసింది.

ఉద్యోగ సంఘాల నాయకులు కూడా సర్దుకున్నారు. అదేదో  సామెత చెప్పినట్లు, అప్పుడే ఉద్యోగ సంఘాలు అందుకు బాధ్యులైన వారిపై ఫిర్యాదు చేసి ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదని, ఉద్యోగులు అంటున్నారు. అందుకే ఇప్పుడైనా, పోలీసు కంప్లైంట్ ఇచ్చి, సీబీసీఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.  ఇక విషయంలోకి వస్తే, డీఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో జూలై 2018,  జనవరి 2019 డీఏ బకాయిలను ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో బకాయిలు జమ చేసింది.

ఆ తర్వాత కొంత కాలానికి వారికి తెలియకుండానే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది. తమ ఖాతాల్లో డబ్బులు విత్‌డ్రా అయినట్లు మెసేజ్‌లు వస్తేనే కానీ, తమ ఖాతాలో సోమ్ములకు రెక్కలు వచ్చిన విషయం ఉద్యోగులకు తెలియలేదు. అలా తెలిసిన తర్వాత ఆ విషయాన్ని ఉద్యోగులు, సంఘాల నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మళ్లీ ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు జమ చేసింది. ఆ విధంగా ప్రభుత్వం చేసిన నేరం నుంచి బయట పడింది. 
బహుశా, అదే ధీమాతో కావచ్చును, అలావాటులో పొరపాటు అన్నట్లుగా  మరో మారు,అదే చేసింది. మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్‌ అవుతున్నట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అకౌంట్‌టెంట్‌ జనరల్‌(ఏజీ) తమ వెబ్‌సైట్‌లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ జీపీఎఫ్‌ ఖాతాల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన స్లిప్పులు అందుబాటులో ఉంచింది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు తమ జీపీఎఫ్‌ ఖాతాల్లో గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలు చూసుకున్నారు. డీఏ బకాయిల రూపంలో తమ ఖాతాల్లో జమ అయిన జీపీఎఫ్‌ సొమ్ము మళ్లీ మాయమైనట్లు గుర్తించారు. మార్చి నెలలో ఉద్యోగుల ఖాతాల నుంచి జీపీఎఫ్‌ సొమ్ము ఉపసంహరించినట్లు స్టేట్‌మెంట్‌లో కనిపిస్తోంది. డీఏ ఎరియర్స్‌ బకాయిలు చెల్లించినట్లే చెల్లించి తమకు తెలియకుండానే ఖాతాల్లో సొమ్ము మాయం చేశారని ఉద్యోగులు మండిపడుతున్నారు. తాము దాచుకున్న డబ్బులకు ప్రభుత్వం బ్యాంకర్‌గా వ్యవహరించాలని... తమ అనుమతి లేకుండా ఎవరు విత్‌డ్రా చేసినా అది క్రిమినల్‌ కేసు అవుతుందని ఉద్యోగులు అంటున్నారు. మార్చి నెలలో తమ ఖాతాల్లో జరిగిన లావాదేవీలను అకౌంటెంట్‌ జనరల్‌ తమకు ఇప్పటి వరకు ఎందుకు తెలియజేయలేదని నిలదీస్తున్నారు. 
నిజానికి, ఇలా ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్ అవసరాల కోసం జీపీఎఫ్‌లో దాచుకున్న సొమ్ములకు  కస్టోడియన్ గా ఉన్న ప్రభుత్వమే, ఉద్యోగులకు తెలియకుడా వారి ఖాతాల నుంచి విత్ డ్రా చేయడం, చట్ట రీత్యా చాల పెద్ద  నేరమవుతుందని, ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. సుమారు 90 వేల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి రూ.800 కోట్లు తీసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ చర్యకు పాల్పడిన సీఎఫ్ఎంఎస్‌ ఆధికారులపై తక్షణమే చర్యలు చేపట్టాలి. సీఐడీ విచారణ జరపాలని, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు.సూర్య నారాయణ డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వం ఏమి చేస్తుంది, అనేది చూడవలసి వుంది .