మహా సంక్షోభానికి ముగింపు?.. అసెంబ్లీలో బల నిరూపణకు ఉద్ధవ్ థాక్రేకు గవర్నర్ ఆదేశం

మహా రాజకీయ సంక్షోభం ముగింపు దశకు వచ్చినట్లేనా? ఇక రేపో మాపో రాష్ట్రంలో అధికారం చేపట్టేదెవరో..  కొనసాగేదెవరో తేలిపోనున్నదా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మహారాష్ట్రలో రాజకీయ ఉత్కంఠకు ఇక తెరపడే సమయం ఆసన్నమైందనే అంటున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీ గురువారం అంటే జూన్ 30న సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో గెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ మేరకు గవర్నర్ ఉద్ధవ్ థాక్రేను ఆదేశించారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై స్టే ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరగకుండా ఆదేశాలివ్వాలన్న ఉద్ధవ్ వినతిని సుప్రీం కోర్టు తిరస్కరించడంతో ఆయన గవర్నర్ ఆదేశాలను పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. గవర్నర్ ఆదేశాల మేరకు ఉద్ధవ్ థాక్రే తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ఆయన గురువారం సాయంత్రం 5 గంటల లోపు సభలో తన బలాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది. బీజేపీ సహా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

అయితే బల నిరూపణపై స్టే కోసం ఉద్ధవ్ థాక్రే మరోసారి సుప్రీంను ఆశ్రయించే యోచనలో ఉన్నారు. ఇన్నాళ్లూ తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండేకు, ఆయనతో పాటు ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలకూ తెరవెనుక ఉండి అండగా నిలబడిన బీజేపీ ఇప్పుడిక తెరముందుకే వచ్చేసింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ నేతలు ప్రత్యక్షంగా కార్యాచరణకు ఉపక్రమించారు. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ హస్తిన వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.

హస్తిన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఫడ్నవీస్ మహారాష్ట్ర గవర్నర్ తో భేటీ అయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినందున వెంటనే అసెంబ్లీని సమావేశ పరిచి ఉద్ధవ్ థాక్రే బలపరీక్షకు ఆదేశించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన శివసేన రెబల్ ఎమ్మెల్యేలు 39 మంది, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఇండిపెండెంట్లు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదంటూ గవర్నర్ కు తెలియజేయడమే కాకుండా ఈ మేరకు ఓ లేఖ కూడా ఆయనకు అందజేశారు.

ఇండిపెండెంట్లు వేరుగా గవర్నర్ కు మరో లేఖ పంపారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో బల నిరూపణ చేసుకోవలసిందిగా సీఎం ఉద్ధవ్ థాక్రేను ఆదేశించారు. ఇందు కోసం గురువారం అసెంబ్లీని సమావేశ పరిచి, సాయంత్రం ఐదుగంటలలోగా బలాన్ని నిరూపించుకోవలసిందిగా గడువు నిర్దేశించారు.