ఇంతకీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం ఎప్పుడో? ప్రశ్నిస్తున్న వైకాపా

 

ప్రశ్నించడానికే తను పుట్టుకొచ్చానని చెప్పుకొన్న పెద్దమనిషి పత్తా లేకుండా పోవడంతో ఆలోటును వైకాపా భర్తీ చేసే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఎప్పుడు జరుపుకోవాలని మంచి ప్రశ్నే వేసింది. ఎందుకంటే ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జూన్ 2ని నవ నిర్మాణ దినంగా పాటించాలని ఆరోజు నుండి వారం రోజులపాటు నవ నిర్మాణ దీక్ష పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు సభలు నిర్వహించి రాష్ట్రాభివృద్ధికి ప్రజలను పునరంకితం అయ్యేందుకు ప్రోత్సహించాలని నిర్ణయించింది. జూన్ 2న నవ నిర్మాణ దినంగా పాటించడం ద్వారా రాష్ట్ర విభజన జరిగిన తీరు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వంచించింది...తదనంతర సమస్యలు, సవాళ్లు, పరిణామాలను అన్నిటినీ ప్రజలు సదా గుర్తుకు చేసుకొంటూ రాష్ట్రాభివృద్ధికి కసిగా పనిచేయాలనే ఉద్దేశ్యంతోనే జూన్ 2న నవ నిర్మాణ దినంగా జరుపుకోవాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సార్లు అన్నారు.

 

జూన్ 2న నవ నిర్మాణ దినంగా పాటించే మాటయితే మరి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం ఎప్పుడు నిర్వహించుకోవాలని వైకాపా ప్రశ్నిస్తోంది. లేకపోతే ఆంద్రప్రదేశ్ అవతరణ దినానికే తెదేపా ప్రభుత్వం నవ నిర్మాణ దినమనే కొత్త పేరు పెట్టిందా? అని ప్రశ్నిస్తోంది.

 

క్రిందటి ఏడాది జూన్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయిన జూన్ 2నే రాష్ట్ర అవతరణ దినంగా పాటిద్దామని చేసిన ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండటం చేత సాధారణంగా ప్రతీ ఏట నవంబర్ ఒకటిన జరుపుకొనే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం వేడుకలను జరుపుకోలేదు. తెదేపా జూన్ 9న రాష్ట్రంలో అధికారం చేప్పట్టడం చేత, రాష్ట్ర విభజన తరువాత వచ్చిన మొట్టమొదటి రాష్ట్ర అవతరణ దినం జూన్ 2న ఎటువంటి వేడుకలు జరుగలేదు. కనుక ఈసారి రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న అట్టహాసంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తుందని ప్రజలు భావించడం చాలా సహజం. కానీ ఆరోజును నవ నిర్మాణ దినంగా జరుపుకొంటూ వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు సభలు నిర్వహించుకొందామని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడంతో ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తుందా లేదా? రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలలో ఆరోజున రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలా వద్దా? అని వైకాపా ధర్మసందేహం వ్యక్తం చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu