పెట్టుబడుల ఊతంతో ఏపీ ప్రగతి పరుగులు!
posted on Nov 12, 2024 10:14AM
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఐదేళ్ల అరాచక పాలన అంతమై.. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి నిండా ఐదు నెలలు పూర్తికాకుండానే.. సన్ రైజ్ స్టేట్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపును సాధించింది. పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. దేశంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. బాబు దార్శనికతపై ఇన్వెస్టర్లలో, పారిశ్రామిక వేత్తలలో ఉన్న నమ్మకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. చంద్రబాబు అంటే సంపదసృష్టికర్త, ఆ సృష్టించిన సంపదను సమాజంలోని అణగారిన వర్గాలకు సంక్షేమంగా అందించాలన్న దృక్ఫథం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన మార్క్ అభివృద్ధిని ప్రపంచానికే రోల్ మోడల్ గా మార్చింది. అయితే 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఏపీ అభివృద్ధి తిరోగమనంలో పడింది. అస్తవ్యస్థ విధానాలు, అరాచక పాలన, దోపిడీ, దౌర్జన్యం, కక్ష సాధింపు ఇవే ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల పాటు సాగాయి. పరిశ్రమలు తరలివెళ్లిపోయాయి. ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్ వైపే చూడటం మానేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు 2014 నుంచి 2019 వరకూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోయింది. ఏపీ ఇమేజ్ దెబ్బతింది.
2024 ఎన్నికలలో జగన్ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి కొలువుదీరిన తరువాత కూడా సర్వత్రా అనుమానాలే. చంద్రబాబు ఏపీకి పోయిన బ్రాండ్ ఇమేజ్ ను మళ్లీ తీసుకురాగలరా? సంపదసృష్టితో అభివృద్ధి సంక్షేమాలను జోడుగుర్రాళ్లీ పరుగులెత్తించగలరా? అన్న సందేహాలను పరిశీలకులు సైతం వ్యక్తం చేశారు. ఎందుకంటే జగన్ ఐదేళ్ల హయాంలో ఆంధ్రప్రదేశ్ ఇక ఎన్నటికీ తేరుకోలేదన్నంతగా విచ్ఛిన్నమైంది. కానీ చంద్రబాబు తన అనుభవంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. అన్ని విధాలుగా అధోగతి పాలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారు.
ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 65 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు రిలయెన్స్ ముందుకు వచ్చింది. అంటే దేశంలో గుజరాత్ రాష్ట్రం తరువాత రిలయెన్స్ ఏపీలోనే భారీగా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యింది. రాష్ట్రంలో 500 బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి రిలయెన్స్ ముందుక వచ్చింది. ఇటీవల ముంబైలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ అనంత్ అంబానీతో భేటీ అయ్యారు. ఆ భేటీ ఫలితమే ఇప్పుడీ పెట్టుబడులు. అలాగే టాటా పవర్ కూడా ఆంధ్రప్రదేశ్ లో సౌర, పవన్ విద్యుత్ రంగంలో 40 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది. అంతే కాకుండా విశాఖ టిసీఎస్ కంపెనీ కొత్తగా ఐటి డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. అలాగే టాటా గ్రూప్ ఏపీలో ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. అలాగూ ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల నడిబొడ్డున భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా అక్కడి నించి విమానసేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.