రాష్ట్రాలు, రాజకీయాల గురించి కీలక చర్చలు... కేసీఆర్ తో జగన్ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ నేడు భేటీ కానున్నారు. ఆ భేటీలో నీళ్ల పంపకాల అంశాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నా.. రాజకీయ అంశాలపై కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముందని అంటున్నారు. మూడున్నర నెలల తరవాత జరుగుతున్న ఈ సమావేశంపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మూడున్నర నెలల క్రితం కృష్ణా ,గోదావరి నదుల అనుసంధానంపై జగన్ , కేసీఆర్ చర్చించారు, అధికారుల స్థాయిలోనే సంప్రదింపులు జరిగాయి. రెండు రాష్ట్రాల నుంచి ప్రణాళికలు రూపొందించారు. ఒక దానికి ఆమోద ముద్ర వేసి రెండు రాష్ట్రాల సమన్వయంతో ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. నదుల అనుసంధానంపై ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని గత సమావేశాల్లో అనుకున్నా.. అడుగు కూడా పడలేదు. ప్రతిపాదనలు దాదాపుగా అయిపోయినట్టేనని ప్రచారం జరిగింది. ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్మాణం కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మరోసారి సమావేశం అవుతున్న సీఎంలు ఈ ప్రతిపాదనలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. 

గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. మరో వైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 80,000 క్యూసెక్కులకు పెంచుతామని సీఎం జగన్ ప్రకటించారు. ఇవన్నీ కూడా భేటీలో చర్చిస్తారని సమాచారం. ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లేలా పరస్పర అంగీకారానికి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు విభజన చట్టంలోని అంశాలను.. షెడ్యూల్ 9 - 10 సంస్థల విభజన, ఉద్యోగుల విభజన, కార్పొరేషన్ లో ఉమ్మడి ఆస్తుల అంశాల పై జగన్ కేసీఆర్ చర్చించే అవకాశముంది. అటు కేంద్రం పట్ల అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు ముఖ్యమంత్రులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం ఆర్థిక సంక్షోభం కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయి. ఇవి సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అటు సీఏఏ బిల్లుకు వైసీపీ మద్దతు తెలపగా..టీఆర్ఎస్ వ్యతిరేకించింది. అయితే ఎన్ఆర్సీ విషయాల్లో ఇరువురు వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సీఏఏ , ఎన్ఆర్సీల పై తమ విధానం ప్రకటించే అవకాశముంది. ఇటీవల కేటీఆర్ తిరుమల పర్యటన తర్వాతే ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశం ఖరారైనట్లుగా తెలుసింది. తిరుమలలో సీఎం జగన్ సన్నిహితులు మిథున్ రెడ్డితో కేటీఆర్ సమావేశమయ్యారు. ఇక ఈరోజు జరగబోయే భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.