రైతులతో ముఖాముఖి సమావేశం కానున్న ముఖ్యమంత్రి

 

రాజధాని భూసేకరణ అంశంపై కూడా రాజకీయాలు మొదలవడంతో రైతులలో అనేక అనుమానాలు, అపోహలు తలెత్తాయి. రాజధాని భూసేకరణ కోసం మంత్రులతో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఆయా గ్రామాలలో పర్యటించినప్పటికీ, రైతుల సందేహాలను, వారి భయాందోళనలను పూర్తిగా నివృత్తి చేయలేకపోయింది. అందువలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వారితో స్వయంగా సమావేశమయ్యి వారికి ఈ భూసేకరణపై ప్రభుత్వ విధివిధానాలు, రైతులకు ఇవ్వబోతున్న ప్యాకేజీ వంటివన్నీ వివరించి భూసేకరణకు మార్గం సుగమం చేసేందుకు సిద్దమయ్యారు.

 

ఈరోజు హైదరబాద్ లో జరుగబోయే ఈ సమావేశానికి తూళ్ళూరు మండలంలో ఒక్క రాయపూడి గ్రామస్తులు తప్ప మిగిలిన 29గ్రామాల నుండి ఒక్కో గ్రామానికి ఐదుగురు రైతుల చొప్పున బస్సులలో బయలుదేరి వెళ్లబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించబోతున్నారు కనుక దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సమావేశంలో ఆయన రైతులను రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చేందుకు ఒప్పించగలిగినట్లయితే భూసేకరణకు అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా, దీనిపై రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలను కూడా నిలువరించవచ్చును. ఈ సమావేశం అనంతరం ఆయన ఈ భూసేకరణతో సంబంధం ఉన్న రెవెన్యూ, ఆర్ధిక తదితర శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యి భూసేకరణపై విధివిధానాలపై ఒక నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని తాజా సమాచారం.