రాష్ట్రాభివృద్ధితోనే దేశాభివృద్ధి: చంద్రబాబు

 

 

నిన్న తిరుపతిలో జరిగిన 14వ ఆర్థిక ప్రణాళికా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దుస్థితిని సభ్యులకు కళ్ళకు కట్టినట్లు వివరించారు. అంతే కాదు...గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో రెండు ప్రాంతాలలో అభివృద్ధి ఏవిధంగా కుంటుపడిందో వివరించి, తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి చెప్పట్టబోయే ప్రణాళికలను సభ్యుల ముందు ఉంచి, ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రం చేయూత చాలా అవసరమనే విషయం వారు కూడా అంగీకరించేలా చేయగలిగారు. తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి సహాయపడితే తమ ప్రభుత్వం వచ్చే ఐదేళ్ళలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి, ఆ అభివృద్ధి ఫలాలను తిరిగి దేశానికి అందించగలదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం సభ్యులను ఆకట్టుకొంది. కేంద్రం నిధులిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొంటామని ఆయన చెపుతున్నప్పటికీ, దాని వలన యావత్ దేశానికి ప్రయోజనం కలుగుతుందని చెప్పడం ఆయన రాజనీతికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చును.

 

అయితే ముఖ్యమంత్రి గత ప్రభుత్వాలను తిట్టిపోయాడానికే సమయం అంతా వృధా చేశారని రాష్ట్రంలో కాంగ్రెస్, వైకాపాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రానికి భారీగా నిధులు రాబట్టుకోవాలంటే ప్రణాళికా సంఘ సభ్యులకు ఈ పరిస్థితులకు గల బలమయిన కారణాలను చెప్పకుండా కేవలం ‘రాష్ట్రాభివృద్ధి చేసుకొంటాము...నిధులు ఇవ్వండి’ అని చంద్రబాబు నాయుడు కోరి ఉండి ఉంటే వారు కూడా ఆయన విజ్ఞప్తిని తేలికగా తీసుకొనే ప్రమాదం ఉంది. అందుకే ఆయన అంత లోతుగా వివరించవలసి వచ్చింది. నిజానికి కాంగ్రెస్, వైకాపా ప్రతినిధులు కూడా ఆర్థిక ప్రణాళికా సభ్యులను కలిసి రాష్ట్రానికి ఉదారంగా నిధులు మంజూరు చేయమని కోరి ఉండి ఉంటే ప్రజలు కూడా హర్షించేవారు. కానీ వారు ఆపని చేయకుండా, ఆ పని చేసిన రాష్ర్ట ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికార పార్టీ ఏమి చేసినా దానిని గుడ్డిగా వ్యతిరేఖంచాలనే సిద్దాంతం పట్టుకు వ్రేలాడుతున్న కాంగ్రెస్, వైకాపాలు ఇంత కంటే ఎక్కువ దూరం ఆలోచించలేవని వాటి విమర్శలతో స్పష్టమయింది.

 

ఇంతకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఆర్థిక ప్రణాళిక సంఘంతో ఇటువంటి సమావేశాలలో పాల్గొన్నాయి. కానీ అవి ఏవో మొక్కుబడిగా ప్రతిపాదనలు చేసి నిధులు ఆశించడమే తప్ప ఈ విధంగా తమ భవిష్యత్ ప్రణాళికల గురించి ఎన్నడూ సమర్ధంగా వివరించక పోవడం వలన, కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పటికీ ప్రణాళిక సంఘం ఎప్పుడూ కూడా రాష్ట్రానికి ఉదారంగా నిధులు కేటాయించలేదు. ఇప్పుడు కూడా ప్రణాళిక సంఘం చంద్రబాబు కోరినట్లుగా రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయిస్తుందో లేదో తెలియదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తన ప్రయత్నలోపం లేకుండా గట్టిగా కృషి చేసారని చెప్పవచ్చును.

 

ఇప్పటికే ఆయన మూడు సార్లు డిల్లీ వెళ్లి కేంద్రమంత్రులు అందరినీ కలిసి రాష్ట్రానికి సహాయం చేయమని అర్ధించారు. అందుకు వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. కనుక ఇప్పుడు ఆయన ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యుల ముందు చాలా సమర్ధంగా చేసిన వాదనలు, వారికి సమర్పించిన ప్రభుత్వ ప్రణాళికలు చాలా మేలు చేస్తాయని భావించవచ్చును. చంద్రబాబు తమ ప్రభుత్వ స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను ఆర్థిక ప్రణాళికా సంఘం ముందు ఉంచారు. కనుక వాటిలో అన్నిటికీ కాకపోయినా ముందుగా వాటిలో అత్యంత ప్రాధాన్యతగల వాటికయినా ప్రణాళికా సంఘం నిధులు కేటాయించే అవకాశం ఉంది.