మణిపూర్ గొడవలకి రాజకీయ రంగు?

 

మణిపూర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న తెలుగు విద్యార్ధులపై స్థానిక విద్యార్ధులు దాడి చేసి, వారిని వారి గదుల్లో నుండి బయటకు రాకుండా నిర్బందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అందుకు ముక్తాయింపుగా వినబడుతున్న వార్తలు మాత్రం చాలా ఆలోచన రేకెత్తిస్తున్నాయి. విద్యాసంస్థలలో విద్యార్ధుల మధ్య ఇటువంటి ఘర్షణలు సర్వ సాధారణం. స్వరాష్ట్రంలోగల విశ్వవిద్యాలయాలలోనే చదువుకొంటున్న విద్యార్ధులు కులం, రాజకీయ పార్టీల ప్రభావానికి లోనయి ఘర్షించుకొంటుంటే, ఇతర రాష్ట్రాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్ధుల మధ్య ప్రాంతీయతత్వం కారణంగా అప్పుడప్పుడు ఇటువంటి ఘర్షణలు ఏర్పడుతుంటాయి, కానీ వాటిని సదరు విద్యాసంస్థల యాజమాన్యాలు సమర్ధంగా పరిష్కరించినపుడు అవి సమసిపోతుంటాయి. కానీ ఇప్పుడు మణిపూర్ లో విద్యార్ధుల మధ్య జరిగిన ఘర్షణలకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరికలను అన్వయిస్తూ వార్తలు రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

కేసీఆర్ ఇటీవల మీడియాపై చేసిన దురుసు వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర దుమారం చెలరేగుతుండటం, కేసీఆర్ మరియు తెలంగాణా ప్రభుత్వంపై మీడియా, అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. కేసీఆర్ వ్యాఖ్యల వల్ల తెలంగాణా ప్రభుత్వం ఇబ్బందిపడుతున్న ఈ తరుణంలో ఆయన హెచ్చరికలను అన్వయిస్తూ మణిపూర్ విద్యార్ధులు కూడా, "తెలుగు విద్యార్ధులు ఇక్కడ ఉండదలిస్తే తమకు అణిగిమణిగి ఉండాలని" హెచ్చరించారని వార్తలు రావడం చూస్తుంటే, దీనికి ఎవరో రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

 

మణిపూర్ లో తెలుగు విద్యార్ధులపై దాడి జరిగినట్లే, కొన్ని వారాల క్రితం డిల్లీలో అస్సాం, మణిపూర్ తదితర ఈశాన్య రాష్ట్రాల విద్యార్ధులపై కూడా ప్రాంతీయతత్వం ముసుగులో చాలా దాడులు జరిగాయి. అప్పుడు వారందరూ కూడా రోడెక్కి తమ నిరసనలు తెలియజేసారు కూడా. కానీ అప్పుడు ఈ విషయాన్ని ఎవరూ కూడా అంత సీరియస్ గా తీసుకోలేదు. అప్పుడు ఇటువంటి హెచ్చరికలు వినిపించలేదు కూడా. నేటికీ డిల్లీలో అటువంటి సంఘటనలు తరచూ పునరావృతం అవుతూనే ఉన్నాయని నిన్న రాత్రి డిల్లీలో బాబు లాల్ చౌక్ వద్ద లైత్ గోలాయిన్, బోయలిన్ అనే ఇద్దరు మణిపూర్ విద్యార్ధులపై ముగ్గురు స్థానికులు చేసిన దాడి స్పష్టం చేస్తోంది.

 

భావి భారతపౌరలయిన యువ విద్యార్ధులలో జాతీయ దృక్పధం కొరవడి క్రమంగా ప్రాంతీయతత్వం ప్రభలుతుండటం చాలా ఆందోళనకరమయిన విషయం. అటువంటి సున్నితమయిన సమస్యకు రాజకీయ రంగులు కూడా అద్దినట్లయితే చివరికి అదెక్కడికి దారి తీస్తుందో ఎవరూ ఊహించలేరు. అందువలన విద్యార్దుల మధ్య తలెత్తిన ఈ గొడవలను మరింత పెరగకుండా అందరూ కలిసి కృషి చేస్తే వారికీ దేశానికి అందరికీ మంచిది.