దశలవారీగా ఏపీ రాజధాని.. అయోమయస్థితిలో ఏపీ రైతులు
posted on Jul 25, 2015 12:03PM
.jpg)
ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం ఎలా ఇంకా ప్రారంభంకూడా కాలేదు. కానీ అమరావతిపై అంచనాలు మాత్రం చాలా పెరిగిపోయాయి. ఆంధ్ర ప్రభుత్వం ఏపీ సీడ్ క్యాపిటల్ పేరుతో ఫోటోలు విడుదల చేయడం.. అమరావతికి 100 శాతం వాస్తు కుదరడం.. అంతేకాక రాజధానిలో ఆహాశహర్మ్యాలు నిర్మించే దిశగా ప్రయత్నాలు జరగడం ఓరకంగా ఇవన్నీ అమరావతిపై భారీ అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. అసలు అమరావతి నిర్మాణం పూర్తయ్యేసరికి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇవన్నీ చూస్తుంటే మాత్రం నిజంగానే అలా ఉంటుందేమో అని అనిపిస్తుంది.
అంతా బానే ఉంది కానీ సింగపూర్ ప్రభుత్వం ఏపీ రాజధాని ఇచ్చిన ప్లాన్ లో ఈ అమరావతి పనులు దశలవారీగా పూర్తవుతాయని పేర్కొంది. 2035 వరకు పూర్తవుతాయని.. 2018 నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని పేర్కొంది. అయితే సింగపూర్ ప్రభుత్వం చెప్పిన దానికి ఏపీ రైతులు అయోమయస్థితిలో పడిపోయారు. రాజధాని తొలిదశ పనులు 2018 నాటికి పూర్తవుతాయి అంటే ఏపీ సీడ్ క్యాపిటల్ అవ్వచ్చు.. మరి మిగిలిన భూముల సంగతి ఏంటి.. వాటిని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు..తమకు ఇవ్వాల్సిన ప్లాట్లను ఎప్పుడు ఇస్తారు అని రాజధానికి భూమి కేటాయించిన రైతులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి భూసమీకరణ చేపట్టినప్పుడు ప్రతిపక్షాలు పలు రకాలుగా వాదనలు చేసిన రైతులు మాత్రం చంద్రబాబునాయుడిపై నమ్మకం ఉంచి.. ఆయన ఏపీ రాజదానిని ఓమహాద్భుతంగా నిర్మించగలరని విశ్వాసం ఉంచి తన భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణానికి ముందే ప్లాట్ల విభజన పూర్తవుతుందని, ఏ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు ఆ ప్రాంతంలోనే భూములు కేటాయిస్తామని చెప్పారు. అయితే దశలవారీగా నిర్మాణం అనేసరికే రైతులకు సందేహాలు ముసురుకుంటున్నాయి.