ఢిల్లీలో కూర్చుని ఏపీ తలరాతను శాసిస్తున్న తెలుగు బీజేపీ నేత..!

ఢిల్లీ నుండి కథ నడిపించే ఆ బీజేపీ నాయకుడు మన తెలుగువాడే. కానీ రాష్ట్రంలో కనిపించేది తక్కువే కానీ టీవీ డిబేట్లలో మాత్రం ప్రముఖంగా కనిపిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ నాయకులు ఏపీకి అనుకూలంగా ఏదైనా మాట్లాడగానే టీవీ స్క్రీన్ల పైన ఢిల్లీ నుండి ప్రత్యక్షం అవుతారు. అబ్బే ఆ నాయకులు తొందర పడ్డారు, వారి వ్యాఖ్యలతో అసలు పార్టీకి సంబంధం లేదు అని ఖండించి పారేస్తారు. ఢిల్లీ స్థాయిలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రానికి ఏదైనా మంచి చేసి పేరు తెచ్చుకునే అవకాశం ఉన్నా ఏమాత్రం పట్టించుకోరు సరికదా.. ఎక్కడైనా కూసింత మేలు జరుగుతుందంటే వెంటనే వాలిపోయి దానిని కూడా చెడకొట్టడం అయన స్పెషాలిటీ.

 

ఒక రకంగా ఢిల్లీలో ఏపీ బీజేపీకి ఆయనే వాయిస్ అన్నంతగా బిల్డప్ ఇస్తారు. కాని ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిలా వ్యవహారం చేసేస్తూ ఉంటారు. ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా ఉండగా ఆయనను సాగనంపే వరకు నిద్రపోలేదని పార్టీ వర్గాలే చెపుతాయి. అంతే కాకుండా సీఎం జగన్ కు కొంత అనుకూలంగా ఉంటారనే పేరున్న సోము వీర్రాజును ఆయనే తెచ్చి పెట్టారని పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు పార్టీ అధికార ప్రతినిధులను, మీడియాలో చర్చలకు హాజరయ్యేవారిని అయన తన కనుసన్నలలో శాసిస్తున్నారని కూడా వినిపిస్తోంది. మరి కొంత మంది బడా నాయకుల పై ఆయనకు గుర్రుగా ఉన్నా ప్రస్తుతం ఏమీ చేయలేక ఆగిపోయారు కాని లేదంటే వాళ్లకు కూడా చుక్కలు చూపించేవారని తెలుస్తోంది.

 

ఏపీలోని గత ప్రభుత్వం పై ప్రతి రోజు ఉన్నవి లేనివి కూడా చెప్పి ఆ విధంగా అలుపెరుగని పోరాటం చేసి టీడీపీ అడ్రస్ గల్లంతు చేసిన ఈయన ప్రస్తుతం సొంత పార్టీ నేతల మీదే విరుచుకు పడుతున్నారు. కొంతమంది రాష్ట్ర బిజెపి నేతలు పార్టీ ప్రతిష్టను బజారున పడేస్తున్నారని నానా యాగీ చేస్తున్న అయన నిజంగా ఏపీ బీజేపీ అభివృద్ధి కోరుకుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చ పెట్టి వారి పై చర్య తీసుకోవాలి గానీ ఇలా బయటకు వచ్చి సొంత పార్టీ నేతల పై విరుచుకు పడితే పార్టీ ప్రతిష్ట ఏమౌతుందో పాపం అయన ఆలోచిస్తున్నట్టు లేదు. అసలు రాష్ట్ర ప్రజలకు ఏదైనా కూసింత మంచి చేస్తే ఆయనను, అయన పార్టీని కూడా గుర్తించి ప్రజలు గౌరవిస్తారు. ఐతే రాష్ట్ర భవిష్యత్తు దెబ్బ తినే విధంగా వ్యవహరిస్తే ప్రజల మనస్సులో వేరే విధంగా గుర్తుండి పోయే అవకాశం ఉందని తెలుసుకోలేనంత అమాయకుడు మాత్రం కాదు. తాజాగా రాజధాని బిల్లులు న్యాయపరీక్షకు నిలబడవని గొప్ప గొప్ప న్యాయ నిపుణులు వాదిస్తుంటే.. అబ్బే అవేవీ నిజం కాదని ముందుగానే తేల్చేసిన మహానునుభావుడు ఈయన.

 

తాజాగా టీవీ డిబేట్లలోపాల్గొంటున్న కొంతమంది బీజేపీ ప్రతినిధుల పై అయన తన ప్రతాపం చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టీవీ చర్చలలో ఎవరైనా న్యాయం వైపు మాట్లాడితే చాలు వారికీ షోకాజ్ నోటీసులు ఇప్పించడంతో అయన హింస భరించలేక కొంత మంది బీజేపీని కూడా వీడడం జరిగింది. మొత్తంగా ఏపీని అభివృద్ధి చెందనీయకుండా అడ్డగోలుగా వాదించటం అలవాటైన ఆ నేత అటు రాష్ట్రాన్ని ఇటు పార్టీని కూడా నాశనం చేసే పనిలో ఉన్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.