తెలంగాణకూ కంటితుడుపులు వున్నాయేమో!
posted on Jul 4, 2015 11:16PM

తెలంగాణ ముఖ్యమంత్రి చాలాసార్లు కావాలని అంటారో, తెలియక అంటారోగానీ ఆయన మాటలు చాలా వివాదాస్పదమై కూర్చుంటాయి. అలా ఆయన మాట్లాడిన మాటలు ఎంత వివాదాస్పదమైనప్పటికీ, ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆయన ఎంతమాత్రం పశ్చాత్తాపపడిన దాఖలాలు మాత్రం కనిపించవు. ఆయన అనాలోచితంగానో, ఉద్దేశపూర్వకంగానో చేసే వ్యాఖ్యలు ఆయనను అనుసరించేవారికి వేదవాక్యాల్లా అనిపిస్తూ వుంటాయి. వారు కూడా ఆయన చెప్పిన మాటలను వల్లెవేస్తూ వుంటారు. ఆ మాటల కారణంగా వచ్చే పరిణామాలను వారు ఎంతమాత్రం ఊహించరు. విభజనచట్టంలో వున్న సెక్షన్ 8 విషయంలో కేసీఆర్ చేసిన ఒక వ్యాఖ్య నిజంగా విభజన చట్టాన్నే అవమానించే విధంగా వుంది. సెక్షన్ 8 ఆంధ్రావాళ్ళకు కంటితుడుపుగా పెట్టినదేనట... దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదట. హైకోర్టు విభజన విభజన చట్టంలో వుందని, దానిని అమలు చేయకుండా ప్రధాని మోడీ తాత్సారం చేస్తున్నారని, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ వున్నారని ఈమధ్య టీఆర్ఎస్ నాయకులు మాటల దాడికి దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కంటితుడుపుగా సెక్షన్ 8 పెట్టారని టీఆర్ఎస్ నేతలు అంటున్నట్టేగానే, తెలంగాణ ప్రజలకు కంటితుడుపుగానే విభజన చట్టంలో హైకోర్టు విభజన అంశాన్ని పెట్టారేమో అని టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైనా ఆలోచించారా? విభజన చట్టంలో ఏపీకి కంటితుడుపులు ఉన్నట్టయితే తెలంగాణకూ కంటి తుడుపులు వుంటాయి కదా.