రాజధాని కోసం విజయవాడ వద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్ర నిర్మాణం
posted on Sep 23, 2015 2:18PM
.jpg)
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని ప్రపంచంలో అత్యాధునిక నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా పట్టుదలగా ఉన్నారు. రాజధానిని జీవనది కృష్ణానది ఒడ్డున నిర్మిస్తుండటంతో నగరం ఎంత అభివృద్ధి చెడినా దానికి ఎన్నడూ నీళ్ళు కొరత ఉండదు. అలాగే రాజధాని గొప్ప నగరంగా ఎదగాలంటే దానికి అన్ని మౌలిక వసతులతో బాటు అవసరమయినంత విద్యుత్ సరఫరా కూడా ఉండాలి. కనుక రాజధానికి ఎన్నడూ విద్యుత్ కొరత, కోతలు లేకుండా ఉండేందుకు విజయవాడ వద్దగల నార్ల తాతారావు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సమీపంలోనే అమరావతి నగరం కోసమే ప్రత్యేకంగా 800మెగా వాట్స్ సామర్ధ్యం గల ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దాని కోసం కేంద్రప్రభుత్వం నుండి అనుమతులు కూడా సంపాదించింది. రాజధాని అమరావతికి శంఖుస్థాపన జరిగే రోజునే అంటే అక్టోబర్ 22నే ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కూడా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేత శంఖు స్థాపన చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకొంటున్నారు. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణానికి అవసరమయిన 250 ఎకరాల భూసేకరణ కార్యక్రమాన్ని అధికారులు త్వరలో మొదలు పెడతారు.