తిరుపతిలో మరో చిరుత సంచారం.. మళ్లీ భయం గుప్పిట్లోకి జనం

మూడు నెలలు  ఫారెస్టు అధికారులకు, ఎస్వీ వర్సిటీ భద్రతా సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కిందని ఊపిరి పీల్చుకున్నంత సేపు పట్టలేదు తిరుపతి జనాలకు. మరో చిరుత కూడా తిరుపతి నగరంలో సంచరిస్తోందన్న వార్తతో వారు మళ్లీ భయం గుప్పిట్లోకి వెళ్లిపోయారు. సోమవారం (ఆగస్టు 18) అటవీ అధికారులు ఎస్వీ యూనివర్సిటీ వద్ద అమర్చిన బోనులో చిరుత చిక్కడంతో గత మూడు నెలలుగా భయం భయంగా గడిపిన తిరుమల జనం ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.

ఈ చిరుత గత మూడు నెలలుగా  ఎస్వీయూ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ, ఆగ్రి కల్చర్ యూనివర్సిటీ, జూపార్కు రోడ్డు, అలిపిరి వద్ద సంచరిస్తూ  కుక్కలు, దుప్పులు, జింకలను చంపేస్తూ వచ్చింది.  అంతే కాకుండా జూపార్కు రోడ్డులో ఓ టూవీలర్ పై వెళ్తున్న వ్యక్తిపై కూడా దాడికి పాల్పడింది. అతడు తృటిలో తప్పించుకున్నాడనుకోండి అది వేరే విషయం. దీంతో చిరుత దాడికి ఎప్పుడు ఎక్కడ గురి అవ్వాల్సి వస్తుందో అన్న భయంతో విలవిలలడిన తిరుపతి వాసులు చిరుత బోనులో చిక్కడంతో హమ్మయ్య అనుకున్నారు.

అయితే  అంతలోనే మరో చిరుత కూడా తిరపతి నగరంలో సంచరిస్తోందన్న వార్త వారిని బెంబేలెత్తిస్తోంది. సోమవారం (ఆగస్టు 18) సాయంత్రమే మరో చిరుత  కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.  మంగళం రోడ్డులోని డీమార్ట్ వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో  చిరుత కదలికలు కనిపించాయి. స్థానికుల సమాచారం మేరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అటవీ అధికారులు చిరుత పాదముద్రలను గుర్తించారు. దీంతో ఆ చరుతను బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒంటరిగా ఎవరూ ఆ ప్రాంతంలో సంచరించవద్దని అటవీ అధికారులు హెచ్చరించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu