ఏపీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడంటే?
posted on Jan 27, 2025 9:50AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ పై కసరత్తు మొదలెట్టేసింది. వచ్చె నెల అంటే ఫిబ్రవరి 6న కేబినెట్ భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఆ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయాలని నిర్ణయించింది. అలాగే ఏపీ బడ్జెట్ ఎలా ఉండాలి, ప్రాధామ్యాలేమిటి? ఏయే శాఖలు, రంగాలకు కేటాయింపులు అధికంగా ఉండాలి, సంక్షేమ పథకాల అమలుకు కేటాయింపులు, అభివృద్ధికి ఆటంకం లేకుండా, సంక్షేమ పథకాల అమలుకు ఢోకా లేకుండా బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం (జనవరి 27) సమీక్ష నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఆరు నెలలకు గానీ బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు. ఈ మధ్య కాలంలో ఆర్డినెన్స్ ద్వారా ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ ను రెండు సార్లు ప్రవేశ పెట్టింది. ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత ఏ క్షణంలోనైనా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సమాయత్తమౌతోంది.
అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. గత వైసీపీ ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.2,86,389లతో జగన్ ప్రభుత్వం ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ సమర్పించింది. 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40 గ్రాంట్ల కింద రూ. 1,09,052.34 కోట్లకు గత ప్రభుత్వం శాసనసభ ఆమోదం తీసుకుంది. ఆ తరువాత ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి జూన్ నెలలో అధికార పగ్గాలను చేపట్టింది.
ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా ఉండటంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జులైలో మరోసారి ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ కు ఆమోదం తీసుకుని, ఆగస్టు మూడు నుంచి నవంబర్ వరకూ నాలుగు నెలల కాలానికి రూ.1,29,972.97 కోట్లతో 40 గ్రాంట్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్‌కు గవర్నర్‌ఆమోదం పొందింది. దీంతో ఎనిమిది నెలల పాటు ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ తోనే కాలం గడిపేసినట్లైంది. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు అన్ని విధాలుగా సమాయత్తమౌతోంది. జగన్ పాలనలో అస్తవ్యస్థంగా తయారైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఈ ఏడు నెలల కాలంలో ఒకింత గాడిన పెట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది.