అయోధ్య‌లో బయటపడిన శివలింగం, దేవ‌తా విగ్ర‌హాలు

అయోధ్య రామజన్మభూమి వద్ద స్థలం చదును చేస్తుండగా పురాత‌న దేవ‌తా విగ్ర‌హాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. దేవ‌తా విగ్ర‌హాల‌తో పాటు శివలింగం కూడా లభ్యమైంది. ఈ శివలింగం ఎత్తు ఐదు అడుగులు ఉన్నట్టు గుర్తించారు. రామజన్మభూమిలో కొన్నిరోజులుగా భూమి చదును చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడి శిథిలాలను తొలగిస్తుండగా.. విరిగిన దేవతా విగ్రహాలు, ఐదు అడుగుల శివ‌లింగం, 7 నల్లరాతి స్తంభాలు, 6 ఎర్రరాతి స్తంభాలు, ఓ క‌ల‌శంతో పాటు ప‌లు పురాత‌న వ‌స్తువులు బయటపడ్డాయి. 

దీనికి సంబంధించి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ఈ నెల 11 నుంచి కార్మికులు రామజన్మభూమి స్థలం చదును చేస్తున్నారన్నారు. ఈ త‌వ్వ‌కాల్లో స్తంభాలతో పాటు ప‌లు శిల్పాలు వెలుగు చూశాయ‌న్నారు. వీహెచ్‌పీ నేత వినోద్ భ‌న్సాల్‌ మాట్లాడుతూ.. మే 11న రామాయ‌లం ప‌నులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి త‌వ్వ‌కాల్లో పూర్ణ కుంభం వంటి ఎన్నో అవ‌శేషాలు ల‌భించాయ‌ని తెలిపారు.