ఆనం కుటుంబానికి సవాల్ గా మారనున్న ఉదయగిరి ఉపసమరం
posted on Mar 27, 2012 11:46AM
నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంతో ఖంగుతిన్న ఆనం సోదరులు తమ దృష్టిని త్వరలో ఉదయగిరిలో జరగబోతున్న ఉప ఎన్నికపై పెట్టినట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మేకపాటి చంద్రశేఖరరెడ్డి, టిడిపి తరపున పారిశ్రామికవేత్త బొల్లినేని వెంకటరామారావు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటిదాకా తమ అభ్యర్థిని ఖరారు చేయలేకపోయింది. ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్ ను ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి మాదాల జానకీరామ్, జిల్లా పరిషత్ చైర్మన్ చెంచాల బాబుయాదవ్, సీతారామపురం మాజీ జెడ్.పి.టి.సి. దుక్కిరేద్ది గురవారెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు కవ్వా కృష్ణారెడ్డి, పుట్టం బ్రహ్మానందరెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్ధికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉదయగిరిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ఎలాగైనా అక్కడ గెలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లాలో మరోసారి ఆనం, మేకపాటి కుటుంబాల మధ్య పోరుకు ఉదయగిరి వేదిక కాబోతుంది.