వీడు మగాడురా బుజ్జీ...
posted on Aug 5, 2019 1:50PM
.jpg)
అదేంటి అనుకుంటున్నారా....అవును నిజమే అమిత్ షా నిజంగా మగాడనిపించుకున్నారు. ఈ రోజు దేశం మొత్తం ఒకటే టెన్షన్ అదే జమ్మూ కశ్మీర్ సవరణ బిల్లు. ఆ బిల్లు రూపొందించడం మొదలు ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం, మరోపక్క ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి నుంచి గెజిట్ నోటిఫికేషన్ వెలువడడం క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. విపక్షాల ఊహకు కూడా అందని విధంగా కేంద్ర ప్రభుత్వం తన కార్యాచరణను పక్కాగా అమలు చేసింది.
అసలేం జరుగుతోందో విపక్షాలకు అర్థమయ్యేలోగానే తాము చేయాలనుకున్నది మోదీ ప్రభుత్వం చేసేసింది. ముందస్తు పక్కా వ్యూహంతో పార్లమెంటులో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. మరోవైపు, జమ్ముకశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున భద్రతాబలగాలను మోహరింపజేశారు. ఇక ప్రస్తుతం రాజ్యసభలో తీవ్ర గందరగోళం మధ్య జమ్ముకశ్మీర్ బిల్లు మీద చర్చ జరుగుతోంది.
ఈ చర్చలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఆర్టికల్ 370 అనే గొడుగు కింది మూడు కుటుంబాలు దశాబ్దాలుగా జమ్ముకశ్మీర్ ను లూటీ చేశాయని నిప్పులు చెరిగారు. భారత్ తో జమ్ముకశ్మీర్ ను అనుసంధానం చేస్తున్నది ఆర్టికల్ 370నే అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ అజాద్ చెబుతున్నారని కానీ అది వాస్తవం కాదని చెప్పారు. 1947 అక్టోబర్ 27న జమ్ముకశ్మీర్ ను భారత్ లో కలపాలనే ఫైలుపై మహరాజా హరి సింగ్ సంతకం చేశారని తెలిపారు.
1954లో ఆర్టికల్ 370 వచ్చిందని చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేసే విషయంలో క్షణ కాలం కూడా వేచిచూడబోమని అమిత్ షా స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్, లడఖ్ లుగా విభజించింది. లడఖ్ ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. జమ్ముకశ్మీర్ ను అసెంబ్లీ కలిగి ఉండే కేంద్రపాలిత ప్రాంతంగా చేసింది. ఇరు ప్రాంతాలకు వేర్వేరు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సందర్భంగా తెలిపారు.
అయితే ఈ వ్యవహారాన్ని కాశ్మీర్ పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు దాదాపుగా మద్దతు ఇస్తున్నట్టే. ఇక ఈ వ్యవహారంలో అమిత్ షా మీద ప్రశంసలు కురిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా అమిత్ షా మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వల్లభాయ్ పటేల్ వలన కూడా కాని పనిని అమిత్ షా చేసిచూపియ్యడంతో ఆయన్ని మగాడురా బుజ్జీ అంటూ సోషల్ మీడియాలో మెమ్స్ చేసి వైరల్ చేస్తున్నారు యువత.