అమెరికా మాజీ అధ్యక్షుడు క్లింటన్ కు కరోనా

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందని ప్రపంచం అంతా ధీమాగా ఉంది. ప్రజలు కరోనా జాగ్రత్తలను గాలికి వదిలేశారు. ప్రయాణ ఆంక్షలు లేవు. భౌతిక దూరం పాటించడమన్న మాటే మర్చిపోయారు. శానిటైజన్ల వాడకం తగ్గిపోయింది. మాస్కుల మాట చెప్పనే అక్కర్లేదు. అయితే కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోలేదనీ, ప్రపంచ వ్యాప్తంగా కేసులలో గణనీయ పెరుగుదల కనిపిస్తోందనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది.

ఇప్పటికే చైనాలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పలు దేశాలలో కూడా ఈ మహమ్మారి వ్యాప్తి చాపకింద నీరులా ఉందని వార్తలు వస్తున్నాయి. మరో సారి కరోనా జాగ్రత్తల గురించి ప్రపంచ దేశాలు పట్టించుకోక తప్పని అనివార్యత ముందు ముందు ఎదురు కావచ్చునని అంటున్నారు.  ముఖ్యంగా కరోనా వ్యాప్తికి కారణమైన చైనాలో  ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు బయటపడుతుండటంతో.. అక్కడి ప్రజలు ముందు జాగ్రత్తగా వెంటిలేటర్లు, ఆక్సిజన్ మెషీన్లను కొనుగోలు చేస్తున్నారు.

ఇక తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ట్వీట్ చేశారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని బిల్ క్లింటన్ తెలిపారు. వ్యాక్సిన్, బూస్టర్ డోస్ వేయించుకోవడం వల్ల కరోనా తీవ్రత తక్కువగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్, బూస్టర్ డోసులు వేయించుకోవాలని సూచించారు.