దిగొచ్చిన అమెరికా.. మేముసైత‌మంటూ సాయం..

అగ్ర‌రాజ్యం స్వార్థం వీడింది. మేముసైత‌మంటూ దిగొచ్చింది. ఇన్నాళ్లూ త‌మ‌కు అమెరికా ప్ర‌యోజ‌నాలే  ముఖ్య‌మంటూ మొండిగా వ్య‌వ‌హ‌రించింది. వ్యాక్సిన్ త‌యారీకి కావ‌ల‌సిన ముడి స‌రుకు స‌ర‌ఫ‌రా చేయ‌కుండా చీఫ్‌గా బిహేవ్ చేసింది. అధ్య‌క్షుడు బైడెన్ తీరుపై అమెరిక‌న్ల నుంచే ఒత్తిడి పెర‌గ‌డం, ప్ర‌పంచ దేశాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో.. అమెరికాకు బుద్ది వ‌చ్చిన‌ట్టుంది. కొవిడ్‌పై పోరాటంలో భారత్‌కు కావాల్సిన సహకారం అందిస్తామంటూ యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ హామీ ఇచ్చారు. కరోనా కట్టడిలో ఉపయోగపడే కీలక వైద్య పరికరాలు, ఇతర సరఫరాలను భారత్‌కు పంపనున్నామని తెలిపారు.   

మొదటి దశ విజృంభణ సమయంలో అమెరికా ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి నెలకొనగా.. భారత్‌ తమకు అండగా నిలబడిందని బైడెన్‌ గుర్తుచేసుకున్నారు. అదే రీతిలో ఇప్పుడు ఆపదలో ఉన్న భారత్‌కు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొవిషీల్డ్‌ టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవన్‌ చేసిన ప్రకటనను బైడెన్‌ తన ట్వీట్‌కు జత చేశారు. అలాగే పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కూడా పంపించనుంది.  

మరోవైపు భారత్‌లో కొవిడ్‌-19 విజృంభణ ఆందోళకరంగా ఉందని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అన్నారు. ఈ నేపథ్యంలో కావాల్సిన సాయం అందించేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. సాయం అందిస్తూనే.. హెల్త్‌కేర్‌ వర్కర్లతో పాటు భారత ప్రజల క్షేమం కోసం ప్రార్థిస్తున్నామని తెలిపారు.   

భారత్‌లో కొవిడ్‌ రెండో దశ విజృంభణపై ఆ ఇద్ద‌రు నేతలు స్పందించడం ఇదే తొలిసారి. అంతకుముందు భారత్‌కు అండగా నిలవకపోవడంపై సొంత పార్టీలోని భారత సంతతికి చెందిన నేతల నుంచి బైడెన్ పాలకవర్గం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. మిగులు టీకాలతో పాటు అవసరమైన వైద్య పరికరాలు పంపాలని వారు ఒత్తిడి తెచ్చారు. గతంలో భారత్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వంటి ఔషధాల్ని అమెరికాకు పంపిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో బైడెన్ దిగొచ్చారు. భార‌త్‌కు స‌హాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. 

ఇండియాకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన అమెరికాకు మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆక్సిజ‌న్ ప‌రిక‌రాల కొనుగోలులో భార‌త్‌కు మైక్రోసాఫ్ట్ త‌ర‌ఫున‌ మ‌ద్ద‌తిస్తామ‌ని చెప్పారు. భార‌త్‌లో ప‌రిస్థితి చూసి త‌న హృద‌యం ముక్క‌లైంద‌ని బాధ‌ను వ్య‌క్తం చేశారు స‌త్య నాదెళ్ల‌. 

అమెరికాకు చెందిన మ‌రో దిగ్గ‌జ సంస్థ గూగుల్ సైతం భార‌త్‌కు స‌హాయం చేసేందుకు ముందుకొచ్చింది. భార‌త్‌కు ఏకంగా 135 కోట్ల విరాళం ఇవ్వ‌నున్న‌ట్టు గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ ప్ర‌క‌టించారు. కొవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న గివ్ ఇండియాకు, యూనిసెఫ్‌కు ఈ ఫండ్ అందించనున్నట్టు తెలిపారు. 

భారత్‌కు సహాయమందించేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా వంటి దేశాలతోపాటు పాకిస్థాన్ కూడా ముందుకొచ్చింది. ఇండియాలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఫ్రాన్స్, బ్రిటన్ స‌హాయం చేయ‌నున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu