మోడీ దీవాళీ ధమాకా ఆఫర్.. జీఎస్టీలో సవరణలు
posted on Aug 16, 2025 1:14PM

దేశ రాజధాని ఢిల్లీలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం (ఆగస్టు 15) ఘనంగా జరిగాయి. ఎర్రకోట వేదికగా జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఉదయం ఏడున్నర గంటల సమయంలో.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దీవాళి గిఫ్ట్ ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. రాబోయే జీఎస్టీ సంస్కరణలు దేశానికి దీపావళి కానుకగా కోబోతున్నాయని ప్రధాని మోడీ పంద్రాగస్టు వేడుకల సాక్షిగా ప్రకటించారు.
ఈ దీపావళికి దేశ ప్రజలకుగానూ.. డబుల్ దీపావళి కానుక ఇస్తున్నట్టు ప్రకటించారు మోడీ. దేశ పౌరులకు పెద్ద బహుమతి అందుతుందనీ, తాము నెక్స్ట్ జెనరేషన్ జీఎస్టీ సంస్కరణలను తీసుకువస్తున్నామనీ చెప్పారు. ఈ సంస్కరణలతో దేశవ్యాప్తంగా పన్ను భారం తగ్గుతుందన్నారు. ఇది దీపావళికి ముందే అందించే బహుమతిగాఅభివర్ణించిన ఆయన.. ఈ సంస్కరణలు దేశ ప్రజల దిల్ ఖుష్ అయ్యే శుభవార్త అన్నారు. ఎనిమిదేళ్ల క్రితం అనేక సంస్కరణలు చేపట్టామని అందులో జీఎస్టీ ప్రధానమైనదనీ గుర్తు చేసిన మోడీ, గతంతో పోలిస్తే జీఎస్టీ విధానం ద్వారా పన్నుల భారం తగ్గించామని.. ట్యాక్సేషన్ ప్రక్రియను సులభతరం చేశామని చెప్పారు.
సరిగ్గా 2017 జులై 1న, జీఎస్టీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇప్పడు ఆ నిబంధనలు అమలులోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్బంగా వీటిని సమీక్షించే సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి.. రాష్ట్రాలతో చర్చలు జరుపుతామన్నారు. ఇప్పటికే కొత్త జీఎస్టీ సంస్కరణలను సిద్ధం చేశామని వివరించారు. సామాన్యులపై పడే వస్తు సేవల భారం.. కొత్త సంస్కరణ ద్వారా గణనీయంగా తగ్గుతుందన్న తీపి కబురు చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద లాభం కలుగుతుందన్న హ్యాపీ న్యూస్ అందించారు. నిత్యవసర వస్తువులు చౌకగా లభిస్తాయనీ.. ఇది మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని మోడీ అన్నారు.
దేశంలో తక్షణ డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించే యూపీఐ సేవలను ఎర్రకోట వేదికగా ప్రశంసించారు ప్రధాని. ఈ రోజు ప్రపంచం యూపీఐ అనే ఒక అద్భుతాన్ని చూస్తోందనీ.. రియల్ టైమ్ లావాదేవీలలో 50 శాతం భారత్‌లోనే యూపీఐ ద్వారా జరుగుతున్నాయన్నారు. సోషల్ మీడియా, క్రియేటివ్ రంగాల్లో అన్నీ మనవే ఎందుకు కాకూడదని.. యువతకు సవాల్ విసిరారు.