కమలం గూటికి మాజీ క్రికెటర్ అంబటి?.. ఈ సారైనా నిలకడగా ఉంటాడా?
posted on Jan 28, 2025 10:09AM
.webp)
అంబటి రాయుడు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రొఫెషనల్ క్రికెటర్ గా మొదలై.. ఇప్పుడు రాజకీయాలలోకి ప్రవేశించారు. క్రికెటర్ గా అసమాన ప్రతిభ ఉన్నప్పటికీ స్థిరత్వం లేకపోవడం, దూకుడు, తొందరపాటు నిర్ణయాల కారణంగా అంబటి రాయుడు క్రికెట్ కెరీర్ తొందరగా ముగిసిపోయింది. మాంచి ప్రతిభ గలిగిన క్రికెటర్ గా క్రీడాభిమానులకు చిరపరిచితుడైన అంబటి రాయుడు తన క్రికెట్ కెరీర్ ను తొందరపాటు నిర్ణయాలతో, దుందుడుకు పోకడలతో చేజేతులా నాశనం చేసుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించడానికి వేచి చూసినంత కాలం పట్లలేదు ఆ క్రికెట్ కెరీర్ కు ముగింపు పలకడానికి. ఎంత ప్రతిభ ఉన్నా అతడిలో నిలకడ లేని తనం కారణంగా అతడి క్రికెట్ కెరీర్ అర్ధంతరంగా ముగిసింది. ఆ తరువాత ఆయన రాజకీయాలలో ప్రవేశించారు. అక్కడా అంతే నిలకడ లేకపోవడం, స్థిరత్వం కొరవడటంతో తొలి అడుగులోనే తడబడ్డాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జారి పడ్డాడు. క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికిన తరువాత అంబటి రాయుడు గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న లక్ష్యంతో అడుగులు వేశాడు. నియోజకవర్గంలో కొంత కాలం చురుగ్గా పర్యటించి, ఒకింత ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు.
గుంటూరు లోక్ సభ నియోకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న లక్ష్యంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ గూటికి చేరారు. గుంటూరు లోక్ సభ స్థానం హామీతో ఆయన వైసీపీ గూటికి చేరారని, అయితే చేరిన రోజుల వ్యవధిలోనే అక్కడి నుంచి పోటీకి అవకాశం లేదని గ్రహించి క్షణం ఆలోచించకుండా వైసీపీ గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆ వెంటనే తాను , విదేశాలలో క్రికెట్ టోర్నీలో పాల్గొనాల్సి ఉన్నందున రాజకీయాల నుంచి చిన్న విరామం తీసుకున్నానని ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే వైసీపీ సామాజిక మాధ్యమంలో అంబటి రాయుడు తాడేపల్లిగూడెంలో జరిగి వైసీపీ సభలో పాల్గొన్న కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఇది జరిగిన వారం రోజుల వ్యవధిలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. దీంతో అంబటిరాయుడు జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారంటూ వార్తలు వినిపించాయి. ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన మళ్లీ వైసీపీకి చేరనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. సిద్ధం అంటూ చేసిన ట్వీట్ ద్వారా అప్పట్లో జగన్ సిద్ధం సభలకు సై అన్న సంకేతాలను ఇచ్చారు. ఇటువంటి నిలకడలేని తనంతో ఆయన తొలి అడుగులోనే రాజకీయాలలో ఒక జోకర్ గా ముద్ర పడ్డారు.
దీంతో గత ఎన్నికల ముందు అటు వైసీపీ కానీ, ఇటు జనసేన కానీ ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. సరే అది వదిలేస్తే ఇప్పుడు అంబటి రాయుడు కమలం గూటికి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నేడో రేపో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో అంబటి రాయుడు నుంచి ఎటువంటి ప్రకటనా లేకపోయినప్పటికీ విశాఖలో జరిగిన ఏబీవీపీ సభల్లో అంబటి రాయుడు పాల్గొన్నారు. ఆ సందర్భంగా అంబటి రాయుడు బీజేపీకి మద్దతుగా మాట్లాడారు. అంతే కాదు దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ మాత్రమేనంటూ పొగడ్తల వర్షం కురిపించేశారు. దీంతో ఆయన కమలం గూటికి చేరడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఏది ఏమైనా మరో సారి అంబటి రాయుడు పోలిటికల్ ఎరీనాలో కనిపించడంతో గతంలో ఆయన పిల్లిమొగ్గలు, కుప్పింగంతులపై నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.