గుండె పోటుతో షూటింగ్ స్పాట్ లోనే కన్నుమూసిన నటుడు
posted on Jan 16, 2025 12:04PM
.webp)
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. భోజ్ పురి యువ నటుడు, యాక్షన్ హీరో సుదీప్ పాండే బుధవారం (జనవరి 15) గుండెపోటుతో కన్నుమూశారు. తన సినిమా షూటింగ్ స్పాట్ లోనే ఒక్కసారిగా కుప్పకూలి సుదీప్ పాండేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 5నే తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సుదీప్ పాండ పది రోజుల వ్యవధిలోనే గుండెపోటుతో మరణించడం బాధాకరం.
సుదీప్ పాండే బహుముఖ ప్రజ్ణాశాలి. కేవలం నటుడిగానే కాకుండా అభిరుచిగల నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. అంతే కాకుండా రాజకీయాలలో కూడా క్రియాశీలంగా ఉన్నారు. ఎన్సీపా పార్టీ తరఫున ఆయన చురుకుగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 2007లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సుదీప్ పాండే తొలి చిత్రం భోజ్‌పురి భయ్యా. అనతి కాలంలోనే యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుదీప్ పాండే ‘ఖూనీ దంగల్’, ‘మసీహా బాబు’, ‘హమర్ సంగీ బజరంగీ బాలి’, ‘హమర్ లాల్కర్’, ‘షరాబీ’, ‘ఖుర్బానీ’ వంటి సినిమాల్లో నటించాడు. సినిమాల్లోకి రాకముందు సుదీప్ పాండే కొంత కాలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు.