రెడ్ బుక్ మరిచిపోలేదు.. అక్రమార్కులకు శిక్ష తప్పదు!
posted on Jan 16, 2025 11:35AM

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్ల జగన్ మయాంలో అరాచకత్వం రాజ్యమేలింది. ఐదేళ్ల జగన్ పాలన అంతా అవినీతి, అరాచకం, దౌర్జన్యం, దోపిడీ అన్నట్లుగా సాగింది. ఆ పార్టీ నేతలు యధేచ్ఛగా అందినకాడికి ప్రభుత్వ భూములు, అటవీ భూములు, ప్రైవేట్ భూములను కబ్జా చేసేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు గురి చేశారు. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ అదికారంలోకి వచ్చిన జగన్ తన హయంలో దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పాలన సాగించారు.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని నానా రకాలుగా వేధింపులకు గురి చేశారు. తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను అన్ని విధాలుగా వేధింపులకు గురి చేశారు. సరే జనం జగన్ అరాచక పాలనకు ఛీ కొట్టి గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత గత ఐదేళ్ల పాలనలో తాము ఎదుర్కొన్న వేధింపులు, మానసిక వేదనకు న్యాయం జరిగేలా చంద్రబాబు సర్కార్ జగన్ హయాంలో జరిగిన అరాచకత్వం, అన్యాయం, దౌర్జన్యం, దోపిడీలపై చర్యలు తీసుకుంటుందని తెలుగుదేశం నేతలు, క్యాడర్ తో పాటు జగన్ హయాంలో వేధింపులకు గురైన జనసైనికులు కూడా ఆశించారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా.. ఆ దిశగా ఎటువంటి చర్యలూ లేకపోవడం వారిని ఒకింత నిరాశకు గురి చేసింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవమానాలు, వేధింపులు, అక్రమ కేసులను ఎదుర్కొన్న తెలుగుదేశం, జనసేన నేతలు, క్యాడర్ కు జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు అన్న ఆశ ఈ ఆరు నెలలుగా అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది.
యువగళం పాదయాత్ర సందర్భంగా రెడ్ బుక్ ను ప్రముఖంగా ప్రస్తావిస్తూ నిబంధనలను తుంగలోకి తొక్కి అరాచకాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరి పేర్లూ ఈ రెడ్ బుక్ లో నోట్ చేశాననీ, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామనీ చెప్పిన లోకేష్ కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టారా అన్న అనుమానాలు వారిలో వ్యక్తమౌతున్న పరిస్థితి. సరిగ్గా ఈ సమయంలో నారా లోకేష్ తాను రెడ్ బుక్ ను మరిచి పోలేదని ఉద్ఘాటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సకుటుంబ సపరివార సమేతంగా కుప్పంలో సంబరాలు చేసుకున్న ఆయన ఆ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన లోకేష్ రెడ్ బుక్ లో పేరున్న ప్రతి ఒక్కరూ వారి పాపాలకు తగిన మూల్యం చెల్లించాల్సిందేననీ, అలా చెల్లించే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పారు. తాను రెడ్ బుక్ ను మరిచిపోలేదనీ, అన్యాయాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేది లేదనీ, ఇప్పటికే రెడ్ బుక్ తన పని తానూ చేసుకుంటూ పోతోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్, ఇసుక మాఫియాలు నడిపిన వారు త్వరలో కటకటాలు లెక్కించడం తధ్యమన్నారు. దీంతో తెలుగుదేశం, జనసేనలలో ఉత్సాహం నెలకొంది. రెడ్ బుక్ ను లోకేష్ మరిచి పోలేదనీ, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయనీ వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.