కమిటీ నివేదిక, చర్యలు సరే.. సమస్యల శాశ్వత పరిష్కారం సంగతేంటి?

ఎట్టకేలకు సింహాచలం అప్పన్న చందనోత్సవ సమయంలో  జరిగిన అపశ్రుతి విషయంలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. చర్యల సంగతి సరే అసలు ఆలయంలో అవకతవకలకు సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం యోచన చేయాల్సి ఉంది. 

గత నెల 30న సింహాచలం చంద్రయాత్ర సందర్భంగా 300 రూపాయల క్యూ లైన్ అనుకుని నిర్మించిన గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. దీనిపై ప్రభుత్వం ముగ్గురు   అధికారులతో కమిటీని నియమించింది.   ఆ కమిటీ నివేదిక ఆధారంగా దేవాదాయ, పర్యాటకశాఖ చెందిన ఏడుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.  సస్పెన్షన్ వేటు పడిన వారిలో సింహాచలం ఈవో కూడా ఉన్నారు.  మరోవైపు గోడ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని కాంట్రాక్టర్ తో సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ చర్యలను ప్రజలు ఆహ్వానిస్తున్నారు.  

అదే సమయంలో ఈ చర్యలతో సమస్యకు పూర్తి పరిష్కారం లభించినట్టు ఎలా అవుతుందన్న ప్రశ్న కూడా సంధిస్తున్నారు.  మొదటి నుంచీ సింహాచలం దేవస్థానంలో కొందరు కాంట్రాక్టర్లు తిష్ట వేశారు.  తాత్కాలికంగా వచ్చే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తోపాటు ఇతరులను మభ్యపెట్టో మాయచేసో  నిర్వహణ పనులతో పాటు కొత్త అభివృద్ధి పనులను నిర్లక్ష్యంగా చేస్తున్నారు.  ప్రసాదం స్కీం డిపిఆర్ సిద్ధమై చాలా కాలం అయింది.  కానీ ఇప్పటికీ ఆ డీపీఆర్ కుఅనుగుణంగా పనులు జరగడం లేదు మెట్ల మార్గం అసంపూర్ణంగా వదిలేశారు సహజ జలధారల ప్రవాహానికి నష్టం కలిగించే రీతిన పనులు జరుగుతున్నట్టు సింహాచలం స్థానికులు చాలా సార్లు ఫిర్యాదు చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో టోల్ గేట్  నిర్మాణం పేరిట   కొండను తవ్వేశారు.  మట్టిని మింగేశారు.  ఇది మాత్రమే కాదు..  గత ప్రభుత్వ హయాంలో సింహాచలం పుష్కరిణిలో పూడిక  తీత  చేపట్టకపోవడంతో  పలువురు భక్తులు నీట  ప్రాణాలు కోల్పోయారు.  దైవదర్శనానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చి పుష్కరిణిలో ప్రాణాలు కోల్పోవడం చాలామందిని  ఆందోళన కలిగించింది. అప్పట్లో బాధ్యులపై అప్పటి వైసీపీ సర్కార్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.  

అప్పన్న స్వామికి   భక్తులు భక్తితో ఇచ్చిన కానుకల విషయంలో  కూడా అవినీతి తిమింగలాలు తమ చేతి వాటం చూపుతున్నాయి.   కొండ ఎగువన హిల్ టాప్ రోడ్డు మార్గంలో కొండపై  నివసిస్తున్న గిరిజన కుటుంబాల కోసం దశాబ్దం కిందటే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే గిరిజనులు దూరంగా వెళ్లడానికి నిరాకరించడం.. కొండకి రక్షణగా ఇక్కడే గిరిజలనులు ఉంచడం సరైందన్న అభిప్రాయం రావడంతో ఆ ఇళ్లను వదిలేశారు.  నిజానికి వాటిని భక్తుల సత్రాలుగా  వాటిని వినియోగించవచ్చు. కానీ ఇప్పటికీ కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆ ఇళ్లు నిరుపయోగంగా ఉండిపోయాయి. ఇలా అన్ని విధాలుగా అప్పన్న నిధులను దుర్వినియోగం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.  క్యూ కాంప్లెక్స్ లు నిర్మాణం ప్రతిపాదన చాలా కాలంగా కాగితాలకే పరిమితమైంది.  అలాగే స్వామి ఆదాయం పోకుండా టికెట్ ఉన్నవారికి లోపలికి అనుమతించే రీతిన ఎలక్ట్రానిక్ గేట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా అమలుకు నోచుకోలేదు.  

ఇక సింహాచలం కొండపై డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.   భారీ వర్షం కురిస్తే ఆ నీరు ఆలయంలో ఉండిపోవడం దిగువున   కొండను కోసుకుంటూ వెళ్లిపోవడం జరుగుతోంది. ఇలా వర్షం నీరు వృధా కాకుండా నిల్వ ఉంచుకునే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే  సింహాచలం అనుబంధంగా ఉన్న మాధవస్వామి ఆలయం పరిసరాల్లో తోటల ఫల సాయం కాంట్రాక్టు విషయంలో కూడా భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటి విషయంలో గత జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన కారణంగానే  అధికారులు కాంట్రాక్టర్లు ఇష్టారీతిగా వ్యవహరించారని స్థానికులు  ఆరోపిస్తున్నారు.  భక్తున్ని రక్షించేందుకు వరాహ లక్ష్మీనరసింహస్వామిగా అవతరించిన శ్రీ మహా విష్ణువు ఉగ్రరూపం ఈరోజు ప్రభుత్వ నివేదిక రూపంలో మరోసారి బయటపడిందని ఉత్తరాంధ్రవాసులు భావిస్తున్నారు.  ఏడుగురు అధికారులపై సస్పెన్షన్ వేటుతో పాటు కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న చర్యలు అప్పన్న స్వామి ఆగ్రహానికి సంకేతంగా చెబుతున్నారు. 1970 ప్రాంతంలో చూస్తే సింహాచలం ఆలయంలో దోపిడీకి ప్రయత్నించిన దొంగల ముఠా చేతిలో బాంబులు పేలిపోయి వారంతట వారే గాయపడిన సంఘటనను ఇప్పుడు భక్తులు గుర్తు చేసుకుంటున్నారు. సింహాచలం అప్పన్నకు అపచారం చేసిన వారికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శిక్ష తప్పదని భక్తులు అంటున్నారు. 

వైసీపీ  హయాంలో పాలకమండలి నియామకంలో కూడా విచ్చలవిడి వ్యవహారాలు జరిగాయి వంశపారంపర్యంగా అనువంశిక ధర్మకర్తగా ఆనంద గజపతి, అశోక్ గజపతి కుటుంబాలు రావాల్సి ఉండగా,  వైసీపీ ప్రభుత్వం అడ్డుగోలుగా ఆనంద గజపతి రెండో భార్య కుమార్తెను తెరపైకి తెచ్చారు.  ఆమె వస్త్రధారణ, వ్యవహార శైలి హిందూ ధర్మానికి విరుద్ధంగా ఉందని గతంలో చాలామంది ఆక్షేపించారు. ఇక పాలకమండలి విషయంలో కూడా అనర్హులకు అవకాశం కల్పించారు.  ప్రత్యేక ఆహ్వానితులు అంటూ మరికొందరిని అవకాశం కల్పించారు ఆ మాజీల దందా ఇంకా కొనసాగుతోంది.  వీరిలో కొందరు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. అప్పన్న స్వామికి చెందిన ప్రహ్లాద కళ్యాణ మండపం చాలా కాలంగా రక్షణ ఉద్యోగుల ఆధీనంలో ఉంది.  ఆ ప్రదేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న భక్తుల డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు.  

 తాజాగా అప్పన్న సన్నిధిలో జరిగిన దుర్ఘటనతో చట్టానికి చిక్కిన అధికారులు గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన వారే. సింహాచలం దేవస్థానం ఈ ఈ శ్రీనివాసరాజు తోపాటు టూరిజం అధికారులు కూడా గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన వారే కావడం, అలాగే ఇప్పుడు క్రిమినల్ కేసు ఎదుర్కొనున్న కాంట్రాక్టర్ కూడా గత ప్రభుత్వ  హాయం నుంచి కొనసాగుతు వ్యక్తే కావడం గమనార్హం.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu