రాజకీయ సంకల్పంతోనే పోలీస్ సంస్కరణలు సాధ్యం : ఏబి వెంకటేశ్వరరావు

 

ప్రజలు చైతన్యంతో ఉద్యమించి ,ఎన్నికల మానిఫెస్టోలో పోలీస్ సంస్కరణలు ప్రాధాన్యత అంశంగా పెట్టించి తద్వారా రాజకీయ సంకల్పాన్ని కలిగిస్తేనే భారతదేశంలో పోలీస్ సంస్కరణలు అమలై చట్టబద్ధ పాలన సాధ్యం అవుతుందని విశ్రాంత ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈనెల 8వ తేదీ గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో పోలీస్ సంస్కరణలపై జరిగిన చర్చా గోష్టికి ముఖ్యఅతిథిగా హాజరై ఏబి వెంకటేశ్వరరావు ప్రసంగించారు. నేడు జైళ్ళలో మగ్గుతున్న లక్షలాది మందిలో 85 శాతం పైగా విచారణ ఖైదీలుగా పేద వర్గాలే ఉన్నారని తెలిపారు. 

న్యాయస్థానాలను రెట్టింపు చేయడం ద్వారా  న్యాయాన్ని అందరికీ అందించగలమని తద్వారా థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండానే, నేర నిరూపణతో నేరాలను తగ్గించవచ్చునన్నారు. పోలీసులలో నైపుణ్యాలను పెంచి ఆధునిక సాంకేతిక పరిణామాన్ని అందించడం, నేర పరిశోధనను, నేర విచారణ నుండి వేరుచేస్తేనే సత్వర న్యాయం సాధ్యమన్నారు. మనతోపాటు బ్రిటన్ నుండి విముక్తి పొందిన సింగపూర్ న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థల్లో అగ్ర భాగాన ఉందని, ఇది రాజకీయ సంకల్పం ద్వారానే సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అన్ని రకాల దుర్మార్గాలపై న్యాయ విచారణ జరిపి, సంబంధిత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఇటీవల తెనాలిలో ముగ్గురు యువకులను ప్రజల మద్య బహిరంగంగా చావ బాది ,ఆ వీడియోను ఉద్దేశ్య పూర్వకంగా ప్రజల ముందు ఉంచి, ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి ప్రయత్నించడం అమానుషమని పేర్కొని, సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే దృఢమైన రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతమున్న సిబ్బంది, వనరులతోనే 75 శాతం మేర సంస్కరణలు తీసుకొని రావచ్చన్నారు. 2.5 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఒకవైపు ఉంటే, మరోవైపు పోలీస్ వ్యవస్థలో మార్పుల కోసం, పేదలకు సత్వర న్యాయం కల్పించడానికి అదనంగా కనీసం 1000 కోట్ల వెచ్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం శోచనీయమన్నారు. 

సభకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి  ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి ప్రైవేట్ ఆర్మీగా మారిందన్నారు. అధికార పార్టీ నేతల కను సన్నలలో క్షేత్రస్థాయిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని, దీని వలన చట్టబద్ధ పాలనకు భంగం వాటిల్లుతుందన్నారు. తెనాలి సంఘటనతో బాధ్యులైన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, న్యాయ విచారణ చేపట్టాలని కోరారు. మాజీ శాసన మండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారి సమస్యలను వివ రించడానికి భయపడే వాతావరణం నేడు ఉందని, ఫ్రెండ్లీ పోలీస్ రావాలని కోరారు. ప్రముఖ విద్యావేత్త ప్రో. డి. ఏ. ఆర్. సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడితే కేవలం వందల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ లుగా విజయం సాధిస్తున్నారని, వీళ్లు కూడా అధికార పార్టీకి దాసోహం కావడం వలన ప్రజాస్వామ్యం ఎలా వికసిస్తుందని ప్రశ్నించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu