భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం..నలుగురు స్మగ్లర్లు అరెస్టు
posted on Jun 8, 2025 3:28PM

అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి అటవీప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకుని, నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు గారి ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆదేశాలతో అధికారులు, సిబ్బంది అన్నమయ్య జిల్లా బురకాయల కోట అటవీ ప్రాంతం చేరుకుని, వేపూరి కోట ఫారెస్ట్ బీటు పరిధిలో డంపింగ్ పాయింట్ల తనిఖీ చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున వీరు అన్నగారి పల్లి సమీపంలోని వంకగట్టు వద్ద ఒక మోటారు సైకిల్ కనిపించింది.
దానిని సమీపించడంతో అప్పటికే అక్కడ గుమికూడి ఉన్న కొందరు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంబడించి నలుగురిని పట్టుకున్నారు. ఆప్రాంతంలో తనిఖీ చేయగా అక్కడ 48 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వారితో పాటు ఎర్రచందనం దుంగలు, మోటారు సైకిల్ ను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.