సీజేఐకి 5వ తరగతి విద్యార్థిని లేఖ! బహుమతి పంపిన జస్టిస్ రమణ  

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తనదైన శైలిలో పని చేస్తున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. కోర్టు తీర్పుల విషయంలోనూ కాదు మౌలిక వసతులు, ఇతరత్రా అంశాల్లోనూ తన మార్క్ చూపిస్తున్నారు. తన దృష్టికి వచ్చే సమస్యలపైనా అత్యంత వేగంగా స్పందిస్తున్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. తాజాగా ఐదవ తరగతి బాలిక రాసిన లేఖకు స్పందించారు. ఆమెను అభినందిస్తూ వెంటనే ప్రత్యుత్తరం రాశారు జస్టిస్ రమణ. 

కేరళకు చెందిన  చిన్నారి భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో సుప్రీంకోర్టు సకాలంలో స్పందించి ప్రభుత్వాలకు తగు సూచనలు చేసిందని అభినందించింది. అందుకు ఆమె కోర్టుకు కృతజ్ఞతలు తెలిపింది. తాను రోజూ ‘ది హిందూ’ దినపత్రిక చదువుతానని తెలిపింది. దీంతో కోర్టు ఎప్పటికప్పుడు స్పందిస్తున్న తీరును గమనించే అవకాశం కలిగిందని పేర్కొంది. కోర్టు చర్యల వల్ల అనేక మందికి సకాలంలో ఆక్సిజన్‌ సహా ఇతర వైద్య సాయం అంది ప్రాణాలు నిలిచాయని చిన్నారి కొనియాడింది.  

త్రిశూర్‌లోని కేంద్రీయ విద్యాలయలో 5వ తరగతి చదువుతున్న లిద్వినా జోసెఫ్‌ లేఖతో ఆగలేదు. సుప్రీంకోర్టులో చీఫ్‌ జస్టిస్‌ ఆసీనులయ్యే బెంచ్‌, అక్కడ ఉండే వస్తువులను స్వయంగా తన చేతులతో బొమ్మ గీసి లేఖకు జత చేసింది. అందులో చీఫ్‌ జస్టిస్‌ తన చేతిలో ఉండే సుత్తితో కరోనాను బాదుతున్నట్లు ఉండడం విశేషంగా ఆకట్టుకుంటోంది. లేఖను సైతం అందమైన స్వదస్తూరితో రాసింది లిద్వినా జోసెఫ్‌.

చిన్నారి లేఖకు చీఫ్‌ జస్టిజ్‌ ఎన్వీ రమణ మంత్రముగ్ధులయ్యారు. లిద్వినా జోసెఫ్‌ లేఖకు వెంటనే ఉత్తరం రాశారు. తాను గీసిన అందమైన బొమ్మతో పాటు లేఖ అందినట్లు తెలిపారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నందుకు అభినందిస్తున్నానన్నారు. మహమ్మారి సమయంలో ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నందుకు చిన్నారిని ప్రశంసించారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఓ బాధ్వతగల పౌరురాలిగా ఎదుగుతావని ఆకాంక్షించారు. అలాగే ఆయన సంతకం చేసిన ఓ రాజ్యాంగ ప్రతిని ఆమెకు బహుమానంగా పంపారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu