20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజ్‌ క‌రోనాకైనా అర్థం అవుతుందా?

మ‌న దేశంలో క‌రోనా 500 కేసులు ఉన్నపుడు లాక్డౌన్ నిర్ణ‌యం తీసుకుని కఠినంగా అమలు చేశారు. 5000 కేసులకు చేరినప్పుడు అందరు చప్పట్లు కొట్టారు. 10000 కేసులకు చేరినప్పుడు అందరు దీపాలు వెలిగించారు. 40000 కేసులకు చేరినప్పుడు ఆకాశంలో పూలు జల్లారు. 50000 కేసులకు చేరినప్పుడు మద్యం దుకాణాలు తెరిచారు. 60000 కేసులకు చేరినప్పుడు రైలు ప్రయాణాలు మొదలెట్టారు. మోదీ మాస్టారీ వ్యూహానికి క‌రోనా వైర‌స్ కూడా సందిగ్ధంలో పండింది. భార‌తీయులు క‌రోనా వైర‌స్‌ను చూసి భ‌యపడుతున్నారా లేక పండగ చేసుకుంటున్నారా? క‌రోనా వైర‌స్ ఆలోచ‌న‌లో ప‌డింద‌ట‌.

క‌రోనాపై పోరాటానికి ప్ర‌ధాన మంత్రి 20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజ్ ప్ర‌క‌టించారు. ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కొత్త సీసాలో పాత సారా అన్న‌ట్లు ప్యాకేజ్ గురించి బుల్లి తెర మీద‌ సీరియల్‌ చూపిస్తున్నారు. ఎంత మంది దేశ‌ప్ర‌జ‌లుకు క‌రోనా సంక్షోభంలో ప్ర‌ధాని మోదీ తీసుకుంటున్న నిర్ణ‌యాలు అర్థం అవుతున్నాయో క‌నీసం దేశ‌భ‌క్తులైనా చెప్పాలి.

దేశ‌ద్రోహులు అయితే కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజ్ బూటకం అంటున్నారు. ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారని క‌మ్యూనిస్టు పార్టీ అంటోంది. వలస కార్మికులు, వీధి వ్యాపారులు, ఇంటి పని కార్మికులు, మత్స్యకారులు, తదితరులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కుడా బదిలీ కాలేదని పేర్కొంది. ఆర్థిక మంత్రి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది.

దేశంలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి 14 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారని, పట్టణ పేదల్లో దాదాపు 80 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొంది. ఇటువంటి సమయంలో ఆదాయ పన్ను పరిధిలోకి రాని కుటుంబాలన్నింటికీ నెలకు రూ.7,500 చొప్పున మూడు నెలల పాటు ప్రభుత్వం నగదు బదిలీ చేయాలి.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన గోడౌన్లలో మగ్గుతున్న 77 మిలియన్‌ టన్నుల నిల్వల నుంచి ఆరు నెలల పాటు ఈ విధమైన ఉచిత పంపిణీ చేయాలి. లాక్‌డౌన్‌తో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్న సమయంలో రైతులు మనుగడ కొనసాగాలంటే వారికి ఒకే విడతలో రుణమాఫీ చేయాల్సిన అసవరం ఉంది. రాష్ట్రాలకు అత్యవసరంగా భారీ మొత్తంలో ఆర్థిక సాయం అందించాలి. లాక్‌డౌన్‌తో జీవితాలు కోల్పోయి రోడ్డున పడ్డ వలస కార్మికులకు తక్షణ ఉచిత రవాణా సదుపాయం కల్పించాలి.