పతనం దిశగా రామ్‌దేవ్ పతంజలి!?

రామ్‌దేవ్ బాబా చిచ్చరపిడుగులాగా యోగాసనాలు చేస్తుంటే జనం చూశారు. చప్పట్లు కొట్టారు. ఆయన అక్కడితో ఆగకుండా తన స్నేహితుడు బాల‌కృష్ణతో కలసి పతంజలి ఉత్పత్తుల సంస్థని ప్రారంభించారు. తనకున్న ఛరిష్మాతో పతంజలి ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్ సృష్టించి బాగానే సొమ్ము చేసుకున్నారు. పతంజిలి సంస్థ ఆయుర్వేద మందులు, ఉత్పత్తులు అమ్ముకుని ప్రశాంతంగా ఉంటే ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండేది కాదు. ఆధునిక అల్లోపతి వైద్యాన్ని విమర్శిస్తూ ప్రకటనలు జారీ చేయడమే పతంజలి సంస్థ పతనానికి బీజం పడేలా చేసింది. ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా మందులు తయారు చేయడం కూడా దీనికి తోడైంది. చివరికి విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి రామ్‌దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టుకు పదేపదే క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇదిలా వుంటే, పతంజలి సంస్థకు చెందిన పలు ఔషధాల తయారీ మీద ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది. స్వసరి గోల్డ్,  దృష్టి ఐ డ్రాప్స్, బ్రోన్‌కమ్, స్వసరి ప్రవాహి, లివొగ్రిట్, స్వసరి అవలేహ్, లిపిడామ్,స్వసరి వాటి, బీపీ గ్రిట్, మధుగ్రిట్, మధునషిని వాటి ఎక్స్ ట్రా పవర్, ముక్తా వాటి ఎక్స్‌ట్రా పవర్, లివమ్రిత్ అడ్వాన్స్, ఐగ్రిట్ గోల్డ్... నిషేధిత మందుల జాబితాలో వున్నాయి.