182మందికి కరోనా.. ఫ్రెషర్స్ డే పార్టీలో కొవిడ్ పంజా.. మెడికల్ కాలేజీలో ఆందోళన..
posted on Nov 26, 2021 11:44AM
మెడికల్ కాలేజీలో 66 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకిన ఘటన కలకలం రేపింది. వెంటనే అలర్ట్ అయిన జిల్లా వైద్య అధికారులు.. మరింత మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు చేశారు. ఏకంగా 182 మందికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఆందోళన చెందిన సిబ్బంది.. మరింత అప్రమత్తం అయ్యారు. 400 మంది స్టూడెంట్స్‌కి టెస్ట్ చేస్తే.. 182 మందికి కరోనా వచ్చిందంటే.. ఆ కాలేజీలో మొత్తం 3000 వేల మంది ఉన్నారు. దీంతో.. ఇంకెంత మందికి వైరస్ సోకిందోననే ఆందోళన వ్యక్తం అవుతోంది.
తాజాగా, కాలేజీలోని మొత్తం సిబ్బంది, వైద్య విద్యార్థులకు కొవిడ్ టెస్టు చేయాలని నిర్ణయించారు. మెడికల్ స్టూడెంట్స్ అంతా ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లే కావడంతో.. వారిలో కొవిడ్ లక్షణాలు స్వల్పంగా కనిపిస్తున్నాయి. వారి రక్త నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌కు పంపించారు. ఇలా, కర్ణాటక, ధార్వాడ్‌లోని ఎస్‌డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. కరోనా సూపర్ స్ప్రెడర్‌గా మారడం ఆందోళన కలిగిస్తోంది.
వాళ్లంతా వైద్య విద్యార్థులు. కొవిడ్ గురించి, జాగ్రత్తల గురించి వాళ్లకు బాగా తెలుసు. ఇప్పటికే రెండు డోసుల టీకా కూడా వేసుకున్నారు. కాకపోతే కరోనాను కాస్త లైట్ తీసుకున్నారు. ఇటీవల కాలేజ్‌లో ఫ్రెషర్స్ డే ఈవెంట్ జరిగింది. అంతా హాజరయ్యారు. మస్త్ మస్త్ ఎంజాయ్ చేశారు. కట్ చేస్తే.. 300మంది మెడికల్ స్టూడెంట్స్‌లో 66 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. అందరినీ హాస్టల్‌లో ఉంచి.. గేట్లకు తాళాలు వేసి.. క్వారంటైన్ చేశారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. ఒకేసారి ఇంతమందికి కరోనా సోకడం.. థర్డ్ వేవ్ ఆరంభమైందా అనే అనుమానం రేకెత్తిస్తోంది. వెంటనే వైద్య అధికారులు అలర్ట్ అయ్యారు.
కర్ణాటకలోని ఎస్‌డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఫ్రెషర్స్ డే పార్టీకి హాజరైన 400 మంది విద్యార్థుల్లో 300 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 66 మంది పాజిటీవ్‌గా తేలింది. తాజాగా మరిన్ని టెస్టులు చేస్తే.. ఆ సంఖ్య 182కి పెరిగింది. సమాచారం తెలుసుకొన్న అధికారులు వెంటనే ముందు జాగ్రత్త చర్యగా కాలేజీలోని రెండు హాస్టళ్లను మూసివేశారు. ఎవరినీ బయటకు వెళ్లనీయడంలేదు. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో ఉన్నారు జిల్లా వైద్యాధికారులు.
కర్నాటకలోనే కాదు.. ఒడిశాలోని విమ్సార్‌లోని మెడికల్ కాలేజీలోనూ ఇలానే కరోనా కలకలం రేగింది. 54మందికి కొవిడ్ సోకింది. వైరస్ బారినపడిన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు నాలుగు హాస్టళ్లను మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. పది రోజుల పాటు క్లాసులు సస్పెండ్ చేశారు. ఈ రెండు ఘటనలు ఇటీవల ఆయా కాలేజీల్లో నిర్వహించిన ఈవెంట్ వల్లే జరగడం ఆసక్తికరం. అందుకే, కరోనా లేదని బిందాస్‌గా ఉండకుండా.. కొవిడ్ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గ్రూప్ యాక్టివిటీస్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.