మహారాష్ట్రలో దారుణం.. 16 మంది కమాండోలు దుర్మరణం

 

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు దారుణానికి తెగబడ్డారు. గడ్చిరోలి జిల్లాలో భద్రతాబలగాలతో వెళుతున్న ఓ వాహనాన్ని శక్తిమంతమైన ఐఈడీతో బుధవారం ఉదయం పేల్చివేశారు. ఈ దుర్ఘటనలో సీ-60 బెటాలియన్ కు చెందిన 16 మంది కమాండోలు ప్రాణాలు కోల్పోయారు. ఐఈడీ పేలుడు తీవ్రతకు జవాన్ల వాహనం తుక్కుతుక్కుగా మారిపోయింది. రోడ్డు మధ్యలో భారీ గొయ్యి ఏర్పడింది.

అంతకుముందు ఇదే జిల్లాలో పురాందా-మాలేగావ్‌-యెర్కడ్‌ జాతీయ రహదారి నిర్మిస్తున్నందుకు కోపంతో మావోలు 36 వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రూ.10కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలోనే మావోయిస్టులు ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం.

అయితే ఈ పేలుళ్లకు ఉపయోగించిన శక్తిమంతమైన ఐఈడీ మావోయిస్టుల చేతికి ఎలా చేరిందనే విషయం చర్చనీయాంశమౌతోంది. సాధారణంగా మావోయిస్టులు ఎప్పుడు దాడి చేసినా.. మందుపాతరలను వినియోగిస్తారు. వాటితోనే విధ్వంసాన్ని సృష్టిస్తారు. కానీ, ఈ సారి మావోయిస్టులు శక్తిమంతమైన ఐఈడీలను వినియోగించడం పట్ల పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. పెద్ద ఎత్తున ఐఈడీని మావోయిస్టులు ఎలా సమకూర్చుకున్నారనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఐఈడీ మావోయిస్టులకు ఎలా చేరిందనే విషయంపైనా వారు దర్యాప్తు చేస్తున్నారు.