శ్రీ సిటీకి ప్రత్యేక పాలానాధికారాలు
posted on Apr 6, 2015 10:49PM
.png)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా అత్యుత్తమయిన పారిశ్రామికవాడగా నిలిచిన శ్రీ సిటీకి ప్రత్యేక పాలనాధికారాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారు. సుమారు 7,600 ఎకరాలలో నెలకొల్పబడిన ఈ అత్యాధునిక పారిశ్రామికవాడ దేశ విదేశాలకు చెందిన అనేక మధ్య తరహా, భారీ పరిశ్రమలున్నాయి. శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ అది తమిళనాడు రాజధానికి చెన్నైకి కేవలం 55కిమీ దూరంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని హైదరాబాద్ నగరానికి 600 కిమీ దూరంలో ఉంది. కనుక అక్కడ పరిశ్రమలు స్థాపిస్తున్నవారు ఏ పనిపడినా ఎటువంటి అనుమతులు కావలసినా తప్పనిసరిగా హైదరాబాద్ బయలుదేరక తప్పడం లేదు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల శ్రీసిటీలో వివిధ పరిశ్రమలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడి పారిశ్రామికవేత్తలు ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చేరు. దానికి ఆయన తక్షణమే స్పందిస్తూ శ్రీ సిటీకి ప్రత్యేకంగా ఒక స్థానిక సంస్థను ఏర్పాటు చేసి దానికి కంటోన్మెంట్ తరహాలో పారిశ్రామిక మరియు స్థానిక పాలనాధికారాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చేరు.
ఆ స్థానిక సంస్థ శ్రీ సిటీలో కర్మాగారాల స్థాపనకు అవసరమయిన అన్ని అనుమతులు మంజూరు చేస్తుంది. మునిసిపాలిటీల మాదిరిగానే ఆ సంస్థ పరిశ్రమలకు నుండి పన్నులు వసూలు చేస్తుంది. అలా వసూలయిన పన్నులతో శ్రీ సిటీలో మౌలికవసతుల కల్పన, పారిశుద్యం వంటి పనులన్నీ చక్కబెడుతుంది. ఆ పన్నులలో కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వానికి జమా చేయవలసి ఉంటుంది. శ్రీ సిటీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్న ఈ స్థానిక సంస్థకు నియమనిబంధనలు రూపొందించి, దానికి చట్టబద్దత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రయోగం సఫలమయినట్లయితే మున్ముందు మరిన్ని ప్రాంతాలకు ఈ పధకాన్ని విస్తరింపజేయడం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగవంతం చేయవచ్చును.