పీఓకేలో... పాక్ పైశాచికత్వం!

గురివింద గింజ సామెత తెలుసు కదా? అలాగే వుంది పాకిస్తాన్ పరిస్థితి. ఆ దేశం భారత్ లో అంతర్భాగంగా వున్న కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ నానా రచ్చ చేస్తుంటుంది. మొన్నటికి మొన్న ఉరీ ఉగ్ర దాడి తరువాత కూడా ఐక్య రాజ్య సమితిలో నవాజ్ షరీఫ్ పాత పాటే పాడాడు. ఇండియా కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వయోలేషన్ చేస్తోందంటూ రికార్డ్ వేశాడు. పనిలో పనిగా బుర్హాన్ వని స్వాతంత్ర సమరయోధుడు అని కూడా చెవిలో పువ్వు పెట్టాడు. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ చేస్తోన్నఅసలు సిసలు మానవ హక్కుల ఉల్లంఘన బయటకొచ్చింది...

 

1947లో జరిగిన యుద్ధంలో భారత్ గెలిచినప్పటికీ కాశ్మీర్లో కొంత భాగం మనం కోల్పోయాం. అందుక్కారణం నెహ్రు కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితిలో పెట్టడమే. ఇక అప్పటి నుంచీ భారత్, పాక్ మద్యలో వుండిపోయిన స్వతంత్ర కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ గా చెలామణి అవుతోంది! కాని, విషాదం ఏంటంటే... ఆజాద్ కాశ్మీర్ పేరులో మాత్రమే ఆజాదీ వుంటుంది. నిజంగా మాత్రం మొత్తం పాకిస్తాన్ పెత్తనమే. ఇంకా దారుణం ఏంటంటే... గత కొన్ని సంవత్సరాలుగా పాక్ తన ఆక్రమిత కాశ్మీర్ ను ఉగ్రవాదుల అడ్డగా మార్చేసింది! వందల కొద్దీ టెర్రరిస్టు క్యాంపులు నడుస్తుంటాయి అక్కడ. అలాంటి వాటి మీదే ఈ మధ్య మన ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. రాత్రికి రాత్రి 40 నుంచీ 50మంది ఉగ్రవాదుల్ని తుడిచి పెట్టింది!

 

ఒకవైపు ఉగ్రవాదులు, మరో వైపు పాక్ సైన్యం... ఇలా రెండు వైపులా దుర్మార్గం, దౌర్జన్యంతో చిక్కి శల్యమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు ఎదురు తిరుగుతోంది. అక్కడి ప్రజలు మొన్న అక్టోబర్ 22న బ్లాక్ డే పాటించారు. ఆ రోజు కాశ్మీర్ ను అనాటి రాజు భారతదేశంలో విలీనం చేశాడు. అది జరిగి డెబ్బై ఏళ్లు కావొస్తోన్నా పీఓకేలోని కాశ్మీరీలకు స్వాతంత్ర్యం రావటం లేదు. పాక్ వాళ్లని రాక్షసంగా బంధించి వుంచుతోంది. అందుకే, కొందరు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్ తో కలుస్తామంటున్నారు. మిగతా వారు కూడా స్వాతంత్ర్యం కావాలంటున్నారు. రోడ్లపైకి వస్తున్నారు.

 

పాక్ దౌర్జన్యాలకి వ్యతిరేకంగా గళం విప్పిన కాశ్మీరీలని దారుణంగా హింసిస్తోంది పాక్ సైన్యం. తీవ్రంగా కొట్టడమే కాదు కాల్పులు జరపటం, కిడ్నాప్ లు చేయటం వంటివి కూడా చేస్తోంది. కాని, ప్రపంచం ముందు ఇండియా కంట్రోల్ వున్న కాశ్మీర్ లోనే అరాచకం రాజ్యమేలుతోందని కల్లబొల్లి కబుర్లు చెబుతుంటుంది. సాధారణంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరిగే దాష్టీకాలు బయటకు రావు. కాని, తాజాగా పాక్ సైనికుల దుర్మార్గాల్ని పట్టి చూపించే వీడియో లీకైంది. దీంతో మోదీ సర్కార్ కి అన్ని దేశాల ముందు పాక్ ని దోషిగా నిలబెట్ట గట్టి ఆయుధం దొరికిన్నటైంది.

 

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనే కాదు బలూచిస్తాన్ లో కూడా పాకిస్తాన్ రక్తపు వరదలు పారిస్తోంది. అక్కడి ప్రజలు ప్రత్యేక దేశమే కోరుకుంటున్నారు. అటు బలూచిస్తాన్ పై, ఇటు పీఓకే పై మోదీ దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. రెండు వైపులా పాక్ ను టార్గెట్ చేస్తేనే మన దేశంలో అంతర్భాగంగా వున్న కాశ్మీర్ కి పక్క దేశం పీడ విరగడ అవుతుంది. ఇండియా పీఓకే, బలూచిస్తాన్ ప్రజల పోరాటానికి అన్ని రకాల మద్దతు ఇవ్వాలి...