ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు..25 మంది మృతి
posted on Jun 1, 2025 11:30AM

ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగి పడుతుండటంతో మూడు రాష్ట్రాలు విలవిల్లడుతున్నాయి. ఫలితంగా మూడు రాష్ట్రాల్లో25 మంది వరకు మరణించారు. అస్సాం రాజధాని గౌహతి లో మట్టి కూరుకుపోయి ఐదుగురు మరణించారు. మణిపూర్‌లో మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు వల్ల ఇంఫాల్ నగరం జీవితం స్తంభించింది. ఇంఫాల్ నది ఒడ్డున నివసిస్తున్నవారు పునరావాస కేంద్రాలకు తరలిపోవాలని అధికారులు సూచించారు. సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో 1,500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు.
గల్లంతయిన 8 మంది పర్యాటకుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలకు వర్షాల వల్ల ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 9 మంది చనిపోయారు. ఈస్ట్ కామెంగ్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఓ వాహనం లోయలోకి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దిగువ సుబాన్‌సిరి జిల్లాలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గువాహటిలో ఒక్క రోజే 111 మి.మీ వర్షం పడింది. 67 ఏళ్లలో ఇదే రికార్డు వర్షపాతం అని అధికారులు వెల్లడించారు.