వచ్చే నెలలో నామినేటేడ్ పదవుల భర్తీ ?

 

 

 

 

  

రాష్ట్రంలో నామినేటేడ్ పదవులు జనవరి లోగా భర్తీ చేస్తామని ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

 

అనేక సంవత్సరాల నుండి ఈ పదవుల భర్తీ వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య మంత్రి అయినప్పటినుండి ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. ముఖ్య మంత్రి, పిసిసి అధ్యక్షుడు ఒక అవగాహనకు వస్తే తప్ప వీటి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేమని పార్టీ అధిష్టానం చెపుతూ వచ్చింది. ఈ విషయంలో ఈ ఇరువురు నేతలు అధిష్టానానికి చెరో జాబితా ఇచ్చి రావడమే అసలు సమస్యకు కారణం.

 

అధికార బాషా సంఘం అధ్యక్ష పదవి, 20 సూత్రాల అమలు కమిటి అధ్యక్ష పదవులు తప్ప, మిగిలిన పదవులను ప్రభుత్వం ఇంత వరకూ భర్తీ చేయలేదు.ఈ పదవులను వెంటనే భర్తీ చేయాలని, లేదంటే పార్టీలో గందరగోళం నెలకొంటుందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ అజాద్ రాష్ట్ర నేతలకు సూచించి చాలా కాలం అయింది. ఇదే అభిప్రాయాన్ని పార్టీ సీనియర్ నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వచ్చిన ముఖ్య మంత్రి ప్రకటన పార్టీ వర్గాల్లో ఆశలను రేపుతోంది.

 

వీటిని భర్తీ చేయకుండా, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకుండా ఉంటే, పార్టీ నేతల్లో గందరగోళం నెలకొంటుందని కొంత మంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ పార్టీలోకి వలసలను ఆపాలంటే, వెంటనే వీటి భర్తీ చేయాలని వారంటున్నారు. ఇక కిరణ్, బొత్స వీటి విషయంలో ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది.