కొత్తగా పెళ్లైన బీఎస్‌ఎఫ్ సైనికులకు శుభవార్త..!

త్యాగాలకు..పోరాటానికి మారుపేరు భారత సైన్యం..ఎన్ని కష్టాలొచ్చినా దేశభద్రతే పరమావధిగా బతుకుతారు మన సైన్యం. ఆఖరికి ఉదయం పెళ్లైయితే సాయంత్రం విధుల్లో చేరేందుకు కూడా మన జవాన్లు ఏ మాత్రం బాధపడరు. కానీ పెళ్లైన గంటకే తమ భర్తలు దేశ సరిహద్దులకు పయనమవ్వడాన్ని వారి భార్యలు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు సైనికులు కూడా కాపలా కాస్తున్నప్పటికి మనసంతా వారి భార్యలపైనే ఉంటోంది. వీరి పరిస్థితిని గమనించిన బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు దీనికి ఒక ఉపాయం ఆలోచించారు. ఇకపై కొత్తగా పెళ్లైన బీఎస్‌ఎఫ్ జవాన్లు దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ భార్యతో కలిసి ఉండవచ్చు. ఈ మేరకు కొత్తగా వివాహం జరిగిన సైనికుల నుంచి బీఎస్ఎఫ్ దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే ఎవరు ముందుగా దరఖాస్తు చేస్తే వారికే అవకాశం. అది కూడా జైసల్మేర్ ఉత్తర, దక్షిణ సెక్టార్‌లో విధులు నిర్వహించే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. రానున్న రోజుల్లో ఈ సదుపాయాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే జవాన్లకు కూడా కల్పించాలని బీఎస్ఎఫ్ యోచిస్తోంది.