ఎక్కడి పొత్తులు అక్కడే ఎవరి గోల వారిదే ..

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కుదరడం సాధారణ విషయం. ఇందుకు ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు.అందుకే రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరు అనే నానుడి పుట్టింది.అయితే అన్ని పొత్తులను ఒకే గాటన కట్టేయ లేము. ఒకప్పుడు పొత్తులకు అంతో ఇంతో ‘భావసారుప్యత’ లేదా ‘లౌకికవాదం’ అనే ముసుగులు అయినా ఉండేది. ఇప్పుదు అవి కూడా తొలిగి పోయాయి. అధికారం కోసం కొందరు ఉనికిని నిలుపుకునేందుకు ఇంకొన్ని పార్టీలు ఎవరితో అంటే వారితో సంసారానికి సిద్దమై పోతున్నాయి.

ముఖ్యంగా దేశంలో సంకీర్ణ రాజకీయాలు పొద్దుపొడిచిన అనంతరం ఒకటి రెండు   మినహాయింపులను పక్కన పెడితే ఇంచు మించుగా దేశంలో ఉన్న అన్నీపార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఇటు కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏలో లేదా అటు బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలుగా అధికారాన్ని అనుభవించాయి. కొన్ని పార్టీలు అయితే సమయానుకూలంగా,అటు యూపీఏలో ఇటు ఎన్డీఏలోనూ అధికారాన్ని పంచుకున్నాయి.

ప్రస్తుతం ఎన్నికలు జరుగతున్న రాష్ట్రాల విషయాన్నే తీసుకుంటే, పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నబీజేపీ,టీఎంసీ ఒకప్పుడు కలిసి కాపురం చేసిన మిత్రులే...అటల్ బిహారీ వాజపేయి మంత్రి వర్గంలో, మమతా బెనర్జీ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు.అలాగే,తృణమూల్,బీజేపీలకు వ్యతిరేకంగా తృతీయ ప్రత్యాన్మాయంగా తెరపైకొచ్చిన, కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తులు అయితే మరీ చిత్రంగా సాగుతున్నాయి.

బెంగాల్లో ఆరెండు పార్టీలదీ ఒకటే  జట్టు. రెండు పార్టీలు కలిసి, మరో ముస్లిం పార్టీ తోడుగా పోటీ చేస్తున్నాయి. అదే  కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కేరళలో కుస్తీ పడుతున్నాయి. ఇప్పుడే కాదు,ఎప్పటి నుంచో, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఎం) సారధ్యంలోని, వామపక్ష కూటమి(ఎల్డీఎఫ్),కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యూడీఎఫ్) ప్రధాన ప్రధాన ప్రత్యర్దులుగా హోరా హోరీగా పోరాడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలను దశాబ్దాలుగా ఈ రెండు కూటములే శాసిస్తున్నాయి. కుండ మార్పిడి పద్దతిలో ఐదేళ్లకో సారి అధికారం ఆ కూటమి నుంచి ఈ కూటమికి ఈ కూటమి నుంచి ఆ కూటమికి మారుతూ వస్తోంది.

అయితే, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల మధ్య శత్రుమిత్ర సంబంధాలు ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఇలాగే, అటూ ఇటూ మారుతూ వస్తున్నాయి. తెలుగు రాష్రాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్’తో ఒకసారి తెలుగు దేశంతో ఒక సారి, ఇలా సమయానుకూలంగా సర్దుబాట్లు చేసుకోవడం చాలా కాలంగా ఉన్నదే. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ విషయంలో చాలా చివిచిత్ర పొత్తులు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు, మహారాష్రాలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివ సేన (మహా వికాస్ అఘాది) కూటమి అధికారంలో ఉంది. అయితే, బెంగాల్లో ఎన్సీపీ, శివ సేన పార్టీలు, కాంగ్రెస్’కు మొండి చేయిచూపించాయి. మమత బెనర్జీకి మద్దతు ప్రకటించాయి. అలాగే, బీహార్’ లో కాంగ్రెస్ మిత్ర పక్షం ఆర్జేడీ కూడా కాంగ్రెస్ – కమ్యూనిస్ట్ కూటమిని కాదని, మమత బెనర్జీకి జై కొట్టింది. ఇప్పుడు అన్ని పార్టీల లక్ష్యం ఒక్కటే .. బీజేపీని ఓడించడం .. అయినా, ఎక్కడి పొత్తులు అక్కడే .. ఎవరి గోల వారిదే ..