ఆ ఒక్కటీ అడక్కు అప్పులకు బుగ్గన భాష్యం

అవసరానికి అప్పులు చేయడం, చేసిన అప్పులను సద్వినియోగం చేసుకోవడం తప్పు కాదు, కానీ, వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి అనుత్పాదక రంగంలో ఖర్చు  చేయడం అయితే అది తప్పే.ఉమ్మడి ఆంద్ర రాష్ట్రంలో అత్యధిక కాలం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి  కొణిజేటి రోశయ్య మాటల్లో చెప్పాలంటే, స్నో పౌడర్లకు ఖర్చు చేయడం,తప్పు.పప్పూ బెల్లాలకు ఖర్చు చేయడం తప్పు.అయితే, అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ, ప్రభుత్వాలు అప్పులు చేయకుండా బండి నడిపించే పరిస్థితి లేదు. రాష్ట్రం ఏదైనా, అధికారంలో ఎవరున్నా, అప్పు లేని, చేయని రాష్ట్రం ఏదీ లేదు. ఎక్కువ తక్కువలు అంతే తేడా మిగిలింది అంతా సేమ్ టూ సేమ్.
అందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలు మినహాయింపు కాదు, నిజానికి, అక్షర క్రమంలో ముందున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్రం, అప్పులు చేయడంలోనూ ముందు వరసలోనే ఉంది. అది ఎవరో అనడం కాదు, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బల్ల గుద్ది మరీ చెప్పిన సత్యం. “అవును రాష్ట్ర ప్రభుతం అంచనాలకు మించి అప్పులు చేసింది,అది నిజం, ఇందులో దాపరికం లేదు” అని అయన కుండబద్దలు కొట్టారు. అంతే కాదు, ప్రజల కోసం, సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం, అప్పులు చేయక తప్పలేదని బుగ్గన అంగీకరించారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.48, 290 కోట్లు అప్పులు చేయాలన్నది బడ్జెట్‌లో చూపించిన అంచనా. కానీ... ఇప్పటికే రూ.73వేల కోట్ల అప్పులు తీసుకొచ్చాం.సంక్షేమం కోసమే అప్పులు చేశాం. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ప్రజల కోసం అప్పులు చేశాం. ప్రభుత్వానికి వేరే మార్గం లేదు’’అని బుగ్గన అసలు రహస్యాన్ని బయట పెట్టారు. అయితే, సంక్షేమ పథకాల వలన ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ప్రభుత్వ ఆదాయం పెరిగిందని జీఎస్టీ వసూళ్లల్లో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని బుగ్గన వెల్లడించారు.

కొవిడ్ కాలంలోను, రాష్ట్రంలో మద్యం పై వచ్చే ఆదాయం ఏమాత్రం తగ్గలేదని. ప్రభుత్వం మద్యం ధరలు పెంచడంతో ఆదాయం పెరిగిందని మంత్రి వివరించారు. అంటే ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కోవడం వలన రాష్ట్ర రాబడి పెరిగిందని ఆయన వివరించారు.ఇదంతా కూడా జగనన్న సక్షేమ పథకాల వల్లనే సాధ్యమైందని చెప్పారు. బాగుంది. అయితే, రోజు రోజుకు పెరిగి పోతున్న అప్పులను తీర్చే మార్గం ఏదైనా ఉందా అంటే .. ఆఒక్కటీ అడక్కు, అన్నట్లుగా అమాత్యుల సమాధానం ఉంది. నిజానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రుణపరిమితి అధిగమించింది. కొవిడ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రుణ పరిమితిని రెండు శాతం పెంచడం వలన ఇంకా అప్పులు పుడుతున్నాయి కానీ, లేదంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసేదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.