టీఆర్ఎస్ కు మజ్లిస్ షాక్! 

టీఆర్ఎస్ కు మజ్లిస్ షాక్ ఇవ్వబోతుందా? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేయబోతుందా? తెలంగాణ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న మజ్లిస్ పార్టీ.. ప్రస్తుతం ఆ పార్టీకి దూరందూరంగా ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ  స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇటీవల వరుస పరాజయాలతో కుదేలైన కారు పార్టీకి.. ఈ ఎన్నికల్లో గెలవడం అత్యంత కీలకం. పట్టభద్రులు, ఉద్యోగులు ఎక్కువ ఓటర్లు ఉండే ఈ స్థానంలో అధికార పార్టీకి గెలుపు కత్తిమీద సామే. అందుకే  ప్రతి ఓటు కోసం శ్రమిస్తున్నారు గులాబీ నేతలు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ స్థానంలో కీలకంగా ఉన్న ఎంఐఎం పార్టీ... అధికార పార్టీకి హ్యాండ్ ఇచ్చిందని తెలుస్తోంది. 

ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన హైదరాబాద్‌– మహబూబ్‌ నగర్‌–రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో మజ్లిస్‌ పార్టీ  ఎవరికి మద్దతు ఇస్తుందన్న విషయంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా మజ్లిస్‌ అధికారికంగా అభ్యర్థిని రంగంలోకి దింపలేదు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి 93 మంది పోటీ పడుతుండగా,  ఓటర్లు ఐదు లక్షలకు పైగానే ఉన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా మైనారిటీ వర్గానికి చెందిన పట్టభద్రులు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. మజ్లిస్ పోటీలో లేనందున మైనార్టీల ఓట్లన్ని.. టీఆర్ఎస్ అభ్యర్థికి పడవచ్చని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం సీన్ మాత్రం మరోలా ఉంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిత్వంపై పతంగి పార్టీలో నిరాసక్తత వ్యక్తమవుతోందని తెలుస్తోంది. 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభివాణి దేవి..  మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు కావడంతో మద్దతు విషయంపై మజ్లిస్‌ ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఆయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు.. అప్పడు ప్రధానమంత్రిగా ఉన్న పీవీ నరసింహరావే బాధ్యుడని మజ్లిస్‌ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. అలాంటి వ్యక్తి కూతురు  అభ్యర్థిత్వాన్ని సమర్థించే ప్రసక్తే ఉండదన్న అభిప్రాయం ఎంఐఎం  పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మైనార్టీ వర్గంలో కూడా పీవీపై కొంత వ్యతిరేకత ఉంది. దీంతో అధికార టీఆర్‌ఎస్‌కు మజ్లిస్‌ సహకరించే  పరిస్థితి కనిపించడం లేదు.   

అధికార టీఆర్‌ఎస్‌తో మజ్లిస్‌ పార్టీకి మొదటి నుంచి బలమైన మిత్రబంధం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ బరిలో దిగని స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు  సహకరించింది. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీలో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేసినప్పటికీ..  మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌కు  మద్దతు ప్రకటించింది. పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం.. అభ్యర్థి కారణంగా అధికార పక్షానికి సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఎంఐఎం తీరుతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.