‘యువరాజు’ అంటే ఒప్పుకోరట!
posted on Oct 26, 2013 7:25PM
.jpg)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, సోనియాగాంధీ తనయుడు రాహుల్‌గాంధీని ఇంతకాలం అందరూ ‘యువరాజు.. యువరాజు’ అని పిలిస్తే మురిసిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీని ‘యువరాజు’ అంటే ఒప్పుకోబోమని వార్నింగ్ ఇచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఈమధ్య తాను మాట్లాడే ప్రతి సభలోనూ రాహుల్‌గాంధీని ‘యువరాజు’ అని సంబోధిస్తున్నారు. ఆయన అలా అంటూ వుండటం కాంగ్రెస్ పార్టీకి చిరాకు తెప్పించినట్టుంది. దాంతో రాహుల్‌గాంధీని దేశంలో జనం అంతా ఎలా పిలుస్తున్నారో నరేంద్రమోడీ కూడా అలాగే పిలవాలి. ‘యువరాజు’ అని అమర్యాదకరంగా పిలిస్తే సహించం అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. నరేంద్రమోడీ మరోసారి రాహుల్‌ని ‘యువరాజు’ అని పిలిస్తే మర్యాదగా వుండదని వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే మన తెలుగు సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’లో జూనియర్ ఎన్టీఆర్ ‘ఎవడు పడితే వాడు బుడ్డోడు.. బుడ్డోడు అంటే గుడ్డలిప్పి కొడతా’ అని చెప్పడం గుర్తొస్తోంది కదూ!