ఇక తీహార్ జైలుకు జగన్ ?

 

  

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డిని అతి త్వరలో తీహార్ జైలుకు తరలించనున్నారా ? ఈ విషయానికి అవుననే సమాధానమే కనిపిస్తోంది. ఈ నెలాఖరులో ఆయనను ఈ జైలుకు తరలించనున్నారని సమాచారం. ఈ డి అధికారులు ఇందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

 

గాలి జనార్ధన్ రెడ్డి ఆస్తులను పెద్ద ఎత్తున అటాచ్ చేసిన ఈ డి అధికారులు ఇక జగన్ ఫై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే, జగన్ అక్రమాస్తుల విషయంలో తగిన పురోగతి సాధించినప్పటికీ, ఇంకా మరికొన్ని విషయాల్లో వెనుక బడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆయనను తీహర్లో ఉంచితే, తమ విచారణ వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి జగన్ ను తీహార్ జైలులో ఉంచాలని అధికారులు ఎప్పుడో భావించారు. అయితే, కొన్ని కారణాల వల్ల అప్పట్లో అది సాధ్యం కాలేదు.

 

ఈ విషయం జగన్ కు తెలియడంతో, పార్టీలోని కొంతమంది కీలక నేతలకు ఈ విషయాన్ని తెలియచేసి, వారిని అందుకు మానసికంగా సిద్దం చేసినట్లు సమాచారం. షర్మిలా పాద యాత్ర ముగిసిన తర్వాత, ప్రజల్లో ఉండేందుకు గాను చేపట్టాల్సిన కార్యక్రమాలను జగన్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. షర్మిలా యాత్రకు సహకారం చేసిన వారికి ఆర్ధిక సహాయం చేయాలని కూడా జగన్ సూచించినట్లు సమాచారం.

 

 

‘సాక్షి’ సిబ్బందితో పాటు, ఇతర జర్నలిస్టుల సహాయంతో పార్టీకి ప్రజల్లో ఉన్న స్పందనను తెలుసుకుని తగు కార్యక్రమాలను చేపట్టాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు. ఒకవేళ జగన్ ను తీహార్ జైలుకు తరలిస్తే, ఇక పార్టీ నేతలు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఆయనను ఇప్పటిలా కలవడం సాధ్యపడదు. అందుకే, జగన్ పార్టీ విషయంలో చెప్పాల్సిన వన్నీ చెప్పారని భావిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu