కత్రినా, దీపికల్లో ఎవరు పొడవు?: కేంద్ర పరీక్షలో ప్రశ్న!
posted on Jul 22, 2014 2:48PM

ప్రశ్న: ఈ క్రిందివారిలో ఎవరు పొడవు? ఆప్షన్లు: 1. హుమా ఖురేషీ, 2. కత్రినా కైఫ్, 3. దీపికా పడుకొనే, 4. ప్రీతీజింటా. ఇదేదో సినిమా క్విజ్ కాదు.. ఈ ప్రశ్నను కేరళలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సి) పరీక్ష ప్రశ్నాపత్రంలో ఇచ్చారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్ష రాసేవారు ఈ ప్రశ్నను చూసి అవాక్కయ్యారు. కేంద్ర మంత్రిత్వశాఖల్లో, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల నియామకానికి నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్న వుండటం సంచలనాన్ని సృష్టించింది. దీనిపట్ల ఎస్ఎస్‌సి చైర్మన్ ఎ భట్టాచార్య విచారం వ్యక్తం చేశారు. ఇది సరైంది కాదని, దిగజారిన ప్రమాణమని, దాంతో తాము తీవ్ర అసంతృప్తికి గురయ్యామని, విచారం వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు. ఉమ్మడి గ్రాడ్యుయెట్ స్థాయి పరీక్షలో అటువంటి ప్రశ్న ఇవ్వడం లైంగిక వివక్ష అంటూ కేరళ మహిళా కమిషన్ ధ్వజమెత్తింది. ఈ ప్రశ్నాపత్రంలోనే మహిళలందరూ పిల్లులు, అన్ని పిల్లులు ఎలుకలు అనేవిధంగా ఓ ప్రశ్న వున్నట్టు కేరళ మహిళా కమిషన్ విమర్శిస్తోంది.