సాహసయాత్ర చంపేసింది: హేరీపోటర్ విలన్ మృతి
posted on Jul 12, 2014 4:22PM

హేరీపోటర్ సిరీస్ సినిమాలన్నింటిలో విలన్గా నటించిన డేవ్ లెగెనో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఓ సాహస యాత్రకు వెళ్ళిన ఆయన అనూహ్య పరిస్థితుల్లో మరణించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో సాహసయాత్ర చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే. ఆ వ్యాలీలోకి సాహస యాత్ర చేయడానికి డేవ్ లెగెనో ఒంటరిగా వెళ్ళాడు. ఫ్రెండ్స్ వారించినా ఆయన కొద్ది రోజుల క్రితం ఆ యాత్రకు వెళ్ళాడు. అయితే మరో ఇద్దరు సాహసయాత్రికులు ఇటీవల డెత్ వ్యాలీ మీదుగా వెళ్తున్నప్పుడు వారికి దారిలో ఒక మారుమూల ప్రాంతంలో లెగెనో మృతదేహం కనిపించింది. ఆయన మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించడానికి హెలికాప్టర్ రావలసి వచ్చింది. హేరీపోటర్ సినిమాల్లో ఎన్నో సాహసాలు చేసిన ఆయన రియల్ లైఫ్‌లో సాహస యాత్ర చేస్తూ మరణించడం బాధాకరం అని ఆయన అభిమానులు అంటున్నారు. యాభై ఏళ్ళ వయసున్న డేవ్ లెగెనో చనిపోవడానికి గుండెపోటు కారణం అని తెలుస్తోంది.